వర్కవుట్‌ అవుతుందా?

ఆరోగ్య స్పృహ ఉండడం అవసరమే!
అందుకోసం వ్యాయామాన్ని ఎంచుకోవడమూ మంచిదే!
అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకున్నా...

అతిగా వ్యాయామం చేసినా...
అది మొదటికే ముప్పు!
మరి అలాంటప్పుడు....
ఎవరు, ఎలాంటి వ్యాయామం ఎంచుకోవాలి?
ఎంతసేపు, ఎంత తీవ్రతతో, ఏ రకం వ్యాయామాలు చేయాలి?
నిపుణులు చెబుతున్న ఆసక్తికరమైన వివరాలు ఈ వారం ‘డాక్టర్‌’ స్పెషల్‌!
 
ముందస్తు పరీక్షలు తప్పనిసరి!
07-05-2019:‘‘కారు కొత్తగా తళతళలాడుతూ కనిపించవచ్చు. కానీ లోపల ఇంజన్‌ ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు... అలాగే, పైకి ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి తాలూకు, అంతర్గత ఆరోగ్యం ఎంత మెరుగ్గా ఉందో ఎదుటివాళ్లే కాదు, వాళ్లంతట వాళ్లూ తెలుసుకోలేరు. అంతర్గత ఆరోగ్యం అనేది వారి వారి ఆహార, జీవన శైలుల మీద ఆధారపడి ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు, మద్యపానం, ధూమపానం లాంటి చెడు అలవాట్లు, ఒత్తిడి, మధుమేహం, అధిక రక్తపోటు.... ఇలాంటి ఎన్నో అంశాలు ఒకరి అంతర్గత ఆరోగ్యాన్ని శాసిస్తాయి. వీటన్నిటినీ అంచనా వేయకుండా, ఎవరికి వారు తాము ఆరోగ్యంగా ఉన్నామనుకుని వ్యాయామాలు చేసేస్తూ ఉంటారు. నిజానికి ఫిట్‌నెస్‌ మీద ఆసక్తితో జిమ్‌లో చేరాలనుకునే ముందు తమ ఆరోగ్యం గురించి పూర్తి అంచనాకు రావాలి. వైద్యులను కలిసి ‘ప్రీ అథ్లెటిక్‌ హెల్త్‌ ఎవాల్యుయేషన్‌’ చేయించుకుని, వ్యాయామానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదని హామీ పొందిన తర్వాతే మొదలుపెట్టాలి. 20 ఏళ్లు, 20 ఏళ్లు దాటినవారు, 25 నుంచి 40, 40 ఏళ్లు దాటినవారు, 50 దాటినవారు... ఇలా వయసు వారీగా ఎవరికి వారు పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది.
 
గుండె జర భద్రం!
జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఇటీవల కొందరు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చూస్తుంటే వ్యాయామం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంటోంది. మరీ ముఖ్యంగా యువకులు ఇలా ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. ఇందుకు వేర్వేరు కారణాలుంటాయి. కొందరికి అంతకు ముందు నుంచే గుండె సమస్యలు ఉండి ఉండవచ్చు. అది వారి దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. కొందరికి ‘కార్డియో మయోపతి’ అనే హృద్రోగం ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు గుండె వేగం పెరిగే వ్యాయామాలు చేసినప్పుడు, గుండెలో విద్యుత్‌ ప్రవాహంలో తేడాలు తలెత్తి హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. శరీరం తట్టుకోగలిగినదానికంటే తీవ్ర స్థాయిలో వ్యాయామాలు పెంచినా, గుండె మీద ఒత్తిడి పెరిగి గుండె ఆగిపోవచ్చు. కొందరికి ఈత సమయంలో, మరికొందరికి పరిగెత్తినప్పుడు గుండెలో ఇబ్బంది తలెత్తవచ్చు. కొందరికి వంశపారంపర్యంగా గుండె సమస్యలు సంక్రమిస్తాయి. మరికొందరికి జన్యుపరంగా హృద్రోగాలు సంక్రమిస్తాయి. కాబట్టి ఏ రకమైన వ్యాయామం మొదలు పెట్టాలనుకున్నా వైద్యులను కలిసి, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. అలాగే వ్యాయామం వేగం, తీవ్రత హఠాత్తుగా పెంచకూడదు. 0 నుంచి 100 వేగం క్షణాల్లో అందుకోవడానికి మానవ శరీరం ఏమీ కారు లాంటి వాహనం కాదు. కాబట్టి తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెట్టి నెమ్మదిగా తీవ్రత పెంచాలి. అలాగే బాడీ ఫిట్‌నెస్‌ కోసం అనవసరంగా వాడే స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లు గుండెపోటుకూ దారి తీస్తాయి.
 
ట్రైనర్‌తో ఏదీ దాచకూడదు!
‘‘జిమ్‌లో వ్యాయామం వైద్య చికిత్స లాంటిదే! చికిత్సకు ముందు వైద్యులతో ఆరోగ్య సమస్యలన్నీ ఎలా ఏకరువు పెడతామో, జిమ్‌ ట్రైనర్‌కు కూడా ఆరోగ్య సమస్యల గురించి స్పష్టంగా చెప్పాలి. ఎముకల సమస్యలు, పూర్వం జరిగిన సర్జరీలు, సాధారణ రుగ్మతలైన అధిక రక్తపోటు, మధుమేహం... ఇలా పూర్తి సమాచారాన్ని శిక్షకులకు తెలియపరచాలి. అలా చెప్పడం వల్ల ఆరోగ్య పరిస్థితికి తగిన వ్యాయామాలను శిక్షకులు సూచించగలుగుతారు. అలాగే వ్యాయామం కోసం సాధారణంగా ఇంటికి దగ్గర్లోని జిమ్‌లో చేరిపోతూ ఉంటారు. కానీ అలా ఎంచుకునే సమయంలో కొన్ని అంశాలను ప్రధానంగా గమనించాలి. అవేంటంటే...
 
సర్టిఫైడ్‌ ట్రైనర్‌: ప్రతి జిమ్‌ సర్టిఫైడ్‌ ట్రైనర్‌ ఆధ్వర్యంలోనే సాగాలి. ఫిట్‌నెస్‌లో ట్రైనర్‌ శిక్షణ తాలూకు సర్టిఫికెట్‌ జిమ్‌లో అందరికీ కనిపించేలా ఉండాలి. సాధారణంగా జిమ్‌లో ఒక సర్టిఫైడ్‌ ట్రైనర్‌ ఉండి, అతని కింద ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్‌ ట్రైనర్లు ఉంటారు. వీరికి ఎలాంటి వ్యాయామాలు చేయించాలో తెలిసి ఉంటుంది. కానీ ఆ వ్యాయామంతో ఎలాంటి కండరాలు బలపడతాయనే లోతైన విషయాల పట్ల అవగాహన ఉండదు. కాబట్టి అధికారిక ట్రైనర్‌ ఆధ్వర్యంలోనే వ్యాయామ శిక్షణ కొనసాగేలా చూసుకోవాలి.
 
పరికరాల మన్నిక: ఎ1 బ్రాండ్‌ పరికరాలు ఉన్న జిమ్‌నే ఎంచుకోవాలి. ఎలాంటి వ్యాయామ పరికరాలైనా ఒకేలా కనిపిస్తాయి. కానీ ‘సైబర్‌, ఏరోఫిట్‌, ఫిట్‌లైన్‌, బాడీలైన్‌’ అనే నాలుగు ప్రధాన బ్రాండ్‌ పరికరాలు మాత్రమే మన్నికైనవి. కాబట్టి ఇవి ఉన్న జిమ్‌ను ఎంచుకోవాలి.
 
సౌకర్యాలు: ప్రతి జిమ్‌లో వాష్‌రూమ్‌, డ్రెస్సింగ్‌ రూమ్‌, లాకింగ్‌ రూమ్‌, తాగు నీరు తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ ఉన్న జిమ్‌ను ఎంచుకోవాలి.

యూట్యూబ్‌ వర్కవుట్స్‌!

కొంతమంది యువకులు జిమ్‌లో చేరకముందే యూట్యూబ్‌లో వర్కవుట్‌ వీడియోలు చూసి ఆ స్ఫూర్తితో జిమ్‌లో చేరతారు. అయితే జిమ్‌లో కూడా అవే వీడియోలను అనుకరించే ప్రయత్నం చేసి, తక్కువ సమయంలో ఎక్కువగా కండరాలు పెంచాలని తాపత్రయపడతారు. నిజానికి యూట్యూబ్‌లో వ్యాయామాల వీడియోలు పోస్ట్‌ చేసేవారు ఎన్నో ఏళ్ల తరబడి ఆ ఫీల్డ్‌లో ఉండి, అనుభవం గడించి వ్యాయామాలు రూపొందిస్తారు. అలాగే సదరు వ్యాయామానికి ముందు, తర్వాత కూడా కొన్ని సపోర్టివ్‌ వర్కవుట్స్‌ (వార్మప్‌, స్ట్రెచింగ్‌) చేస్తారు. ఇవేవీ యూట్యూబ్‌లో కనిపించవు. దాంతో వీడియోలో కనిపించిన వ్యాయామాన్ని అనుకరించే ప్రయత్నంలో, శరీరం రూపం మారడంతో పాటు, ప్రమాదాలకు గురవుతారు. అలాగే వారిలా కండలు పెంచడం కోసం ప్రొటీన్‌ పౌడర్లనూ ఆశ్రయిస్తారు. కానీ బాడీ బిల్డింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ లాంటి క్రీడలను కెరీర్‌గా ఎంచుకున్న కొన్ని నిర్దిష్టమైన ఫిట్‌నెస్‌ ప్రియులకే ప్రొటీన్‌ పౌడర్లు అవసరమవుతాయి. సాధారణ ఫిట్‌నెస్‌ కోరుకునేవారికి వీటి అవసరం లేదు. సరిపడా మాంసకృత్తులు కలిగి ఉండే ఆహారం తీసుకుంటూ శిక్షకుల సూచనల మేరకు అవసరమైన వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌ పొందవచ్చు.’’
 
వర్కవుట్‌ కాస్ట్యూమ్స్‌!
దుస్తులు: వ్యాయామం కోసం ధరించే దుస్తులు సౌకర్యంగా ఉండాలి. వ్యాయామాన్ని ఆటంకపరిచేలా ఉండకూడదు. చమట పీల్చుకునేవై ఉండాలి.
షూస్‌: తప్పనిసరిగా స్పోర్ట్స్‌ షూ ధరించాలి. చెప్పులతో వర్కవుట్‌ చేయడం ప్రమాదకరం.
గ్లౌజులు: బరువులతో కూడిన వ్యాయామాలు చేసే సమయంలో చేతులకు గాయాలు కాకుండా ఉండాలంటే గ్లౌజులు ధరించడం తప్పనిసరి.
న్యాప్కిన్‌: చమట తుడుచుకోవడం కోసం న్యాప్కిన్‌ వెంట తీసుకెళ్లాలి.
 
ఆ పిల్స్‌ వద్దే వద్దు!
‘‘కొందరికి వ్యాయామం చేయడం బద్ధకం. అదొక సమయం వృఽథా  కార్యక్రమం అనే భావనలో ఉంటారు. ఇలాంటివారు చిటికె వేసినంత త్వరగా బరువు తగ్గిపోవాలని కోరుకుంటారు. అందుకోసం దగ్గరి మార్గాలు ఎంచుకునే క్రమంలో ‘ఫ్యాట్‌ బర్నింగ్‌ పిల్స్‌’ మీద ఆధారపడతారు. ఒంట్లోని కొవ్వును కరిగించే ఈ మాత్రలు ఆన్‌లైన్‌లో అమ్ముడవుతూ ఉంటాయి. వీటిని కొని, సొంతంగా వాడేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యకరం కాదు. ఈ మాత్రలు ఆకలిని తగ్గిస్తాయి. పొట్ట నిండిన భావనను కలిగిస్తాయి. దాంతో పరిమితిలోనే తిన్నా, వాంతి అయిపోతూ ఉంటుంది. అలా శరీరానికి పోషకాలు అందక, శక్తి కోసం శరీరం కొవ్వును కరిగించుకుంటుంది. దాంతో కొద్దిగా సన్నబడుతున్నట్టు కనిపిస్తారు. కానీ ఈ పిల్స్‌ కలిగించే దుష్పరిణామాల వల్ల పోషకాహార లోపం తలెత్తుతుంది. మూత్రపిండాలు దెబ్బతింటాయి. రక్తపోటులో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మాత్రలు వాడుతూ, వ్యాయమాలు కూడా చేసే వారి పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. సరిపడా పోషకాహారం తీసుకోకపోవడంతో, వ్యాయమం చేసే శక్తి కూడా సమకూరకపోగా, కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. తల తిరుగుడు, నీరసం, స్పృహ కోల్పోవడం కూడా జరగవచ్చు.
 
షార్ట్‌కట్‌ వద్దు, రహదారే ముద్దు!
మరో రెండు వారాల్లో పెళ్లి ఉందనీ, ఆ లోగా అధిక బరువు తగ్గిపోవాలనీ, అందుకోసం ఏవైనా కొవ్వు కరిగించే మాత్రలు సూచించమనీ నా దగ్గరకు యువతీ యువకులు వస్తూ ఉంటారు. అధిక బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైన రీతిలో సాగాలి. సమతులాహారం తింటూ, వారి వారి ఆరోగ్యాలపరంగా తగిన వ్యాయమాలు క్రమం తప్పక చేస్తూ అధిక బరువును తగ్గించుకోవాలి. పెళ్లి కుదిరింది కాబట్టి బరువు తగ్గాలని కంగారు పడిపోయే కంటే, అంతకు ముందు నుంచే బరువు మీద ఓ కన్నేసి ఉంచితే సరిపోతుంది కదా! ఏ మాత్రం బరువు పెరుగుతున్నామని అనుమానం వచ్చినా ఆహారపుటలవాట్లను సరి చూసుకుంటూ, క్రమం తప్పక వ్యాయామం చేస్తూ బరువు అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాలి.’’
 
ఆ పటుత్వం తగ్గవచ్చు!
‘‘కండల వీరులుగా కనిపించాలనే తాపత్రయం ఈ కాలం కుర్రకారుది! అందుకోసం వ్యాయామాలతో ఆగిపోకుండా, ప్రొటీన్‌ పౌడర్లు, స్టెరాయిడ్‌ ఇంజెక్షన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే ఇవి రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివి. వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడితే, గాడి తప్పి ఆరోగ్యాన్ని నష్ట పరుస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలే తీస్తాయి.
 
ప్రొటీన్‌ పౌడర్లతో చేటు!
మాంసకృత్తులతో ఎవరికీ, ఎలాంటి ఆరోగ్య నష్టం జరగదు. వాటిలో ఉండే మిథియొనైన్‌ అనే ఓ రకం ఎమీనో యాసిడ్‌ను శరీరం శోషించుకునే క్రమంలో తేడాలోనే ఉంది అసలు సమస్య అంతా! ఈ అమీనో యాసిడ్‌ను శరీరం తనంతట తాను తయారు చేసుకోలేదు. తప్పనిసరిగా మాంసకృత్తులను కలిగి ఉండే ఆహారం నుంచే పొందాలి. అంటే మాంసాహార జంతు ఉత్పత్తులను వాడాలి. ఆ జంతువులు కూడా అదే యాసిడ్‌ను ఇతర జంతువులనూ లేదంటే వృక్షసంబంధ ఆహారాన్నీ తినడం ద్వారానే పొందాలి. ఇది సురక్షితమైన పద్ధతి. కానీ ప్రొటీన్‌ పౌడర్ల పరిస్థితి వేరు. వీటి ద్వారా అందే మిథియొనైన్‌ శరీరంలోకి చేరిన తర్వాత మార్పులకు లోనవుతుంది. ఆ క్రమంలో హోమోసిస్టైన్‌ అనే మరో ఎమీనో యాసిడ్‌ స్థాయి పెరుగుతుంది. ఇది రక్తనాళాల వ్యాకోచాలను నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తసరఫరా సక్రమంగా జరగక, అంగం పూర్తిగా స్తంభించదు. నిజానికి కండలు పెరగాలంటే ప్రొటీన్‌కు మించి ‘గ్రోత్‌ హార్మోన్‌’ అవసరం ఎక్కువ. కాబట్టి కండరాల పటుత్వం కోసం సహసిద్ధమైన ఎమీనో యాసిడ్లు విడుదల చేసే అవకాశం శరీరానికి కల్పించేలా ప్రొటీన్‌ పౌడర్ల వాడకానికి బ్రేక్‌ ఇస్తూ ఉండాలి. అలాగే ఎలాంటి ప్రొటీన్‌ పౌడర్‌ వాడాలనుకున్నా, ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి.
 
స్ట్టెరాయిడ్ల వాడకం ప్రమాదకరం!
వైద్యపరమైన అవసరాల కోసం ఉద్దేశించిన స్టెరాయిడ్లు పక్కదారి పట్టి కండరాల పటుత్వానికి, పర్ఫార్మెన్స్‌ల కోసం వాడుకలోకి వస్తున్నాయి. కండలు పెరగడం కోసం (బాడీ బిల్డర్లు), సామర్థ్యం పెరగడం కోసం (క్రీడాకారులు), కొవ్వు కరిగించడం కోసం (బరువు తగ్గాలనుకునేవారు)... ఇలా మూడు కోవలకు చెందిన మూడు రకాల స్టెరాయిడ్లు వాడుకలో ఉన్నాయి. నిజానికి టెసోస్టెరాన్‌ అనే పురుష హార్మోన్‌ నుంచి నేరుగా తయారయ్యే స్టిరాయిడ్స్‌ వాడకం వల్ల కండలు పెరిగే మాట వాస్తవమే అయినా, అంతకుమించిన తీవ్ర దుష్ప్రభావాలూ కలుగుతాయి. అవగాహనలోపంతో అస్తవ్యస్తంగా వాడినా, దీర్ఘకాలం వాడినా, అంగం పరిమాణం తగ్గడం (కుంచించుకుపోవడం), హృద్రోగ సమస్యలు, శరీర తీరులో మార్పులు, విపరీతమైన భావోద్వేగాలు కలుగుతాయి. స్టెరాయిడ్ల వాడకంతో శరీరంలో సహజసిద్ధంగా తయారయ్యే పురుష హార్మోన్‌ టెసోస్టెరాన్‌ తయారీ ఆగిపోతుంది. అలాగే వయసు, వాడిన తీరు, పరిమాణం, తీవ్రత, కాలం... వీటన్నిటి ఆధారంగా వ్యక్తుల్లో కలిగే దుష్ప్రభావాల తీరూ మారుతుంది. ప్రధానంగా వీటి వాడకం వల్ల....

మొటిమలు వస్తాయి

శరీరంలో నీరు నిల్వ ఉండిపోతుంది.
మూత్ర విసర్జనలో ఇబ్బంది తలెత్తుతుంది.
పురుషుల్లో రొమ్ములు పెరుగుతాయి.
వీర్యకణాలు తగ్గుతాయి.
అంగం పరిమాణం తగ్గుతుంది.