క్యాలరీలు కరిగేందుకు.. ఈ టిప్స్ ఫాలో అవండి..!

ఆంధ్రజ్యోతి (11-11-2019): వేడుకల వేళ నోరూరించే ఫలహారాలు, స్వీట్లు వంటివి తెగ లాగించేస్తాం. దాంతో ఒంట్లోకి ఎక్కువ మోతాదులో క్యాలరీలు, చక్కెరలు చేరతాయి. ఫలితంగా ఫిట్‌నెస్‌ దెబ్బతింటుంది. అదనపు క్యాలరీలను కరిగించి, బాడీని డీటాక్స్‌ చేయడానికి ఫిట్‌నెస్‌, యోగా, ఆహార నిపుణులు చెబుతున్న టిప్స్‌ ఇవి.
 
వేగంగా నడవడం: జిమ్‌లో వర్కవుట్లు బోర్‌ కొట్టినప్పుడు ఆరుబయట వాకింగ్‌కు వెళ్లాలి. నడక మంచి వ్యాయామం. వేగంగా నడవడం వల్ల మరిన్ని క్యాలరీలు ఖర్చవుతాయి.
 
జంపింగ్‌, జాగింగ్‌: తిరిగి శక్తి నింపుకొనేందుకు ఉదయాన్నే జంపింగ్‌, జాగింగ్‌ చేయాలి. ఇవి చేస్తున్నప్పుడు అవయవాలకు రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. పాజిటివ్‌ ఆలోచనల్ని పెంచే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి.
 
ఫైబర్‌ రిచ్‌ ఫుడ్‌: తాజా పండ్లు, కూరగాయలు, ఓట్‌మీల్‌ బిస్కెట్లు, నట్స్‌ వంటివి తినడం ఆరోగ్యకరమైన అలవాటు. ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ బదులు ఫైబర్‌ అధికంగా ఉండే చిరుధాన్యాలు, లెగ్యూమ్‌ జాతి గింజలు తినాలి. దీంతో రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అంతేకాదు పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించి తొందరగా ఆకలివేయదు.
 
వర్కవుట్లు: ఎక్కువ సమయం వర్కవుట్‌ చేసేవాళ్లు ‘హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌’ను 30 నిమిషాలు చేస్తే అదనపు క్యాలరీలను తొందరగా ఖర్చుచేయొచ్చు. ఈ వ్యాయామంతో కండరాలు దృఢంగా మారతాయి.
 
యోగా, ప్రాణాయామం: వక్రాసన, చక్రాసన, సర్వాంగాసన వంటివి శరీరానికి మంచి వ్యాయామం. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా ముద్ర, సూర్యముద్ర, మహాముద్ర వంటివి చేయాలి. ఆయుర్వేద పంచకర్మ వైద్యం శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది.