ఆఫీసులో వర్కవుట్స్

13-08-2019:ఉద్యోగినులు ఆఫీసు పనితో పాటు, ఇంటి పనులు కూడా చేసుకోక తప్పదు. అలాంటప్పుడు ఇంటి దగ్గర రోజూ కనీస వ్యాయామాలు చేసుకోవడానికి కూడా కొందరికి టైముండదు. పైగా ఆఫీసులో ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం వల్ల తొందరగా అలసిపోతారు. అయితే ‘బ్రేక్‌ టైమ్‌లో కొన్ని తేలికైన వర్కవుట్స్‌ చేయడం ద్వారా అలసట, ఒళ్లు నొప్పుల నుంచి బయటపడొచ్చ’ని అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అవేమిటంటే...

 
స్ట్రెచ్‌ హిప్స్‌, గ్లుటెస్‌: కుర్చీలో ముందుకూ, వెనక్కీ వాలినట్టుగా కాకుండా వీపు భాగం నిటారుగా ఉండేలా కూర్చోవాలి. భుజాలు, ఛాతి భాగానికి విశ్రాంతి లభించేలా చూసుకోవాలి. ఇప్పుడు ఎడమ మోకాలిని ముందుకు తీసుకువచ్చి, చేతుల్ని మోకాలి మీద లేదా వెనక వైపు ఉంచాలి. నెమ్మదిగా మోకాలును ఛాతివైపు తీసుకు వచ్చి, ఏడు సెకన్ల పాటు అలానే కూర్చోవాలి. తరువాత మునుపటి పొజిషన్‌కు రావాలి. ఇదే వ్యాయామాన్ని కుడి మోకాలుతో కూడా మూడుసార్లు చేయాలి.
 
షోల్డర్‌ స్ట్రెచింగ్‌: ఎడమ భుజాన్ని కుడిచేతి సాయంతో ఛాతి వైపు స్ర్టెచ్‌ చేయాలి. కుడి చేతిని ‘ప్లస్‌’గుర్తులా ఉంచాలి. ఇలాచేస్తే భుజానికి, ముంజేతికి వ్యాయామం లభిస్తుంది. మోచేతిని ఛాతి వైపు తీసుకురావడం వల్ల భుజాలు స్ట్రెచ్‌ అవుతాయి. ఇదే విధంగా కుడి భుజంతో కూడా చేయాలి.
 
వెన్నెముక స్ట్రెచింగ్‌: ఈ ఎక్సర్‌సైజ్‌తో వెన్నునొప్పి మాయమవుతుంది. ఎడమ భుజం మీద కుడి చేయి, కుడిభుజం మీద ఎడమ చేయి ఉంచితే, క్రాస్‌ ఆకారం వస్తుంది. ఇప్పుడు తలను ఎడమ భుజం వైపు తిప్పాలి. తరువాత ఇలానే కుడిభుజం వైపు తిప్పాలి. ఇలా చేయడం వల్ల వెన్నెముక మీద ఒత్తిడి తగ్గుతుంది.
 
గట్టిగా శ్వాస తీసుకోవాలి: కుర్చీలో వెనక్కి వాలి కూర్చోవాలి. శ్వాస గట్టిగా తీసుకొని రెండు చేతుల్ని తల మీదుగా సీలింగ్‌ వైపు పైకి ఎత్తి ఏడు సెకన్ల పాటు ఉంచాలి. ఇలా చేస్తున్నప్పుడు వీపు భాగం ముందుకు రాకుండా చూసుకోవాలి.
 
పాదాలను అందుకోవాలి: కుర్చీలో ముందుకు జరిగి కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. కాళ్లను నేలకు ఆనించి, కొంచెం ఎడంగా పెట్టాలి. అప్పుడు మోకాళ్లు 90 డిగ్రీలో ఉండాలి. నడుము భాగం మోకాళ్ల కన్నా దిగువగా ఉండేలా కూర్చోకూడదు. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలాలి. తర్వాత ముందుకు వంగి, చేతులతో పాదాలను ముట్టుకోవాలి. తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా మూడు సార్లు చేస్తే రిలీఫ్‌గా ఫీలవుతారు.