ఏ వర్కవుట్స్‌కు ఎలాంటి ప్రణాళిక?

జిమ్‌ చేస్తున్నప్పుడుగానీ, వర్కవుట్స్‌ చేస్తున్నప్పుడుగానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఆహార ప్రణాళిక ఎలా ఉండాలి? ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. ఏ వయసువారు ఎలాంటి నియమాలు పాటించాలి?

04-05-2019:వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.

21 ఏళ్ల వయసులోపు పిల్లలు జిమ్‌ కాకుండా స్పోర్ట్స్‌ ద్వారా ఎక్సర్‌సైజులు చేయాలి. స్పోర్ట్స్‌ వల్ల ఆల్‌రౌండ్‌ డెవలప్‌మెంట్‌ వస్తుంది.
22 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్నవాళ్లు జిమ్‌కు వెళ్లే ముందు డాక్టర్‌ క్లియరెన్స్‌ తీసుకోవాలి. మధుమేహం, రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మీకు చికిత్స చేస్తున్న డాక్టర్‌ ఎలాంటి వర్కవుట్‌ సూచిస్తే వాటినే చేయాలి. అతి తక్కువ, అతిగా కూడా చేయకుండా ఆప్టిమల్‌ లెవల్‌ అనుసరించాలి.
హిమోగ్లోబిన్‌ నార్మల్‌గా ఉండాలి. ఎక్సర్‌సైజులు చేస్తున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్‌ అవసరం అవుతుంది. హిమోగ్లోబిన్‌ ఆక్సిజన్‌ను ప్రతీ కణానికి సరఫరా చేస్తుంది. అందుకే హిమోగ్లోబిన్‌ లెవల్‌ తప్పనిసరిగా నార్మల్‌గా ఉండాలి.
వర్కవుట్‌కు ముందు 5-6 బాదాం, 3-6 ఖర్జూరాలు తీసుకుంటే ఆక్సిజన్‌ అందించే కెపాసిటీ పెరుగుతుంది.
బాగా చెమటలు పడుతుంటే, మధ్యలో ఉప్పు కలిపిన నిమ్మరసం కొద్ది కొద్దిగా సిప్‌ చేస్తుండాలి.
వర్కవుట్‌ పూర్తయిన తర్వాత ఒక పండు, ఒక గుడ్డు తీసుకుంటే బలహీనమైన కండరాలు తిరిగి శక్తిని పుంజుకుంటాయి. దీనివల్ల ఒళ్లునొప్పులు కూడా రావు.
వర్కవుట్స్‌ మొదలెట్టిన తర్వాత నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాలి. స్టామినాను బట్టి చేయాలి. అంతేగానీ శక్తిని మించి చేస్తే కండరాల నొప్పి, వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
సాధారణ వ్యక్తి రోజుకు 30 నిమిషాలు వర్కవుట్స్‌ చేస్తే సరిపోతుంది. అవసరాన్నిబట్టి పెంచుకుంటూ వెళ్లొచ్చు. ఒకవేళ బాడీ బిల్డింగ్‌కు వెళ్తున్నవారయితే వారి వర్కవుట్స్‌ మరోవిధంగా ప్లాన్‌ చేయాల్సి ఉంటుంది.
బరువు తగ్గడానికి వర్కవుట్స్‌ చేసేవాళ్లు 200 నుంచి 250 క్యాలరీల దాకా ఏరోబిక్‌ వర్కవుట్స్‌తో బర్న్‌ చేయొచ్చు. దీన్ని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాలి. 
బరువు పెరగాలనుకునేవారు కొంతసేపు ఏరోబిక్‌ చేసి, తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌ చేయాలి. ముందు తక్కువ బరువులతో మొదలెట్టాలి. అరగంట ముందు బనానా మిల్క్‌ షేక్‌ తీసుకుని వెయిట్‌లిఫ్టింగ్‌ చేస్తే ఉపయోగం ఉంటుంది. అందుకే ఎవరి స్టామినాను బట్టి వారి వర్కవుట్స్‌ ప్లాన్‌ చేసుకుని ఆ ప్రకారం ఫాలో అయితే ఫలితం ఉంటుంది.