ఆ నొప్పులకు మందులు వాడొచ్చా?

23-06-2019: నేను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటాను. అయితే కొన్నిసార్లు వ్యాయామం ముగించిన వెంటనే కండరాల నొప్పులు వేధిస్తాయి. ఆ సమయంలో పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతున్నాను. ఇలా చేయడం సరైన పనేనా?

గీత, హైదరాబాద్‌.

వ్యాయామం సమయంలో కండరాలు అలసటకు లోనై నొప్పులు తలెత్తడం సహజం. అయితే ఈ నొప్పులను తగ్గించుకోవడం కోసం పెయున్‌ కిల్లర్స్‌ మీద ఆధారపడడం సరైన పని కాదు. ఇబుప్రోఫెన్‌, అసిటమినోఫిన్‌ అనే మందులు వ్యాయామంతో అలసిన కండరాలకు ఏ విధంగానూ సహాయపడకపోగా, కండరాల ఎదుగుదల కుదించుకుపోయేలా చేస్తాయి. కాబట్టి కండరాల నొప్పులను తగ్గించుకోవడం కోసం వ్యాయామం తదనంతరం తప్పనిసరిగా స్ట్రెచింగ్‌ చేయాలి. అలాగే ఎలాంటి వ్యాయామాలు మొదలుపెట్టే ముందైనా, అందుకు శరీరాన్ని సన్నద్ధం చేయడం కోసం వార్మప్‌ చేయాలి. ఇవన్నీ అనుభవజ్ఞులైన వ్యాయామ శిక్షకుల పర్యవేక్షణలో సాగాలి. వ్యాయామంతో అలసిన కండరాలు తిరిగి శక్తిని పుంజుకోవాలంటే మాంసకృత్తులు సరిపడా తీసుకోవాలి. వ్యాయామం ముగించిన తర్వాత బలవర్థకమైన, మాంసకృత్తులతో కూడిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా కూడా నొప్పులు తలెత్తకుండా నియంత్రించుకోవచ్చు.

ఆదిత్య
ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, పి.ఆర్‌ క్లాసిక్‌ జిమ్‌,
నాచారం, హైదరాబాద్‌