ఆరోగ్యం... మరింత స్మార్ట్‌గా!

 ఆంధ్రజ్యోతి (14-10-2019): చేతికి స్మార్ట్‌వాచ్‌ పెట్టుకుని ఎంత దూరం నడిచారో చూసుకుంటారు. ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ తగిలించుకొని ఎన్ని కేలరీలు ఖర్చు చేశారో చెక్‌ చేసుకుంటారు. హార్ట్‌రేట్‌ ఎంతుందో చూసుకొని మురిసిపోతారు. ఈ టెక్నాలజీ అద్భుతం అనుకుంటున్నారు కదూ! కానీ ఇప్పుడు అంతకు మించిన ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. మరింత స్మార్ట్‌గా జీవించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. ఆ విశేషాలు ఇవి...
 
ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లు ఫిజికల్‌ యాక్టివిటీని మాత్రమే ట్రాక్‌ చేస్తున్నాయి. వ్యాయామం మానేస్తే, నీళ్లు సమయానికి తాగకపోతే రిమైండ్‌ చేస్తున్నాయి. ఇంకొన్ని హార్ట్‌రేట్‌ని నిరంతరం మానిటర్‌ చేస్తూ గుండెజబ్బులు వచ్చే అవకాశాలను గుర్తించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే వేరబుల్‌ టెక్నాలజీ అంతకంటే మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలు కల్పించబోతోంది. మన శరీరం, మనస్సును అవసరాన్ని బట్టి స్టిమ్యులేట్‌ చేసేలా వైబ్రేషన్‌ అలారం గాను, ఎలక్ట్రికల్‌ పల్స్‌ ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందే విధంగానూ ఇప్పటికే అనేక వేరబుల్‌ డివైజెస్‌ మెడికల్‌ రంగంలోకి ప్రవేశించాయి.
 
ఉదాహరణకి.. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే పరిశోధకుడు అభివృద్ధి చేసిన ‘ప్రాజెక్ట్‌ ఎమ్మా’నే పరిగణలోకి తీసుకుంటే ఇది ఒక రిస్ట్‌ బ్యాండ్‌. పార్కిన్సన్‌ వ్యాధిగ్రస్తులు దీన్ని ధరిస్తే బొమ్మలు గీయడం, పేపర్‌ మీద అక్షరాలు రాయడం వంటి పనుల్ని చేయగలిగే విధంగా చిన్న వైబ్రేషన్‌ సిగ్నల్‌ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. మామూలుగా ఆ వ్యాధి ఉన్నవారు చిన్నచిన్న పనులు కూడా చేయలేరు.
 
అటెన్షన్‌ తక్కువగా ఉంటే...
ఈ మధ్యకాలంలో అనేక మందిలో అటెన్షన్‌ డిజార్డర్‌ బాగా ఎక్కువగా ఉంటోంది. అంటే ఏ పని మీద కూడా ఎక్కువ సేపు ఏకాగ్రత చూపించ లేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐటి మీడియా ల్యాబ్‌ పరిశోధకులు ‘అటెన్టివ్‌యు’ అనే ఒక ప్రత్యేకమైన డివైజ్‌ను ఆవిష్కరించారు. ఇది ఈఈజి టెక్నాలజీ ఆధారంగా ఒక మనిషి యొక్క అటెన్షన్‌ను గమనిస్తూ, ఒక విషయం పట్ల ఆ వ్యక్తి ఏకాగ్రత చూపించలేని సందర్భాల్లో హెప్టిక్‌ ఫీడ్‌బ్యాక్‌ అనే విధానం ద్వారా అతని అటెన్షన్‌ మళ్ళీ అవసరమైన అంశం మీదకు మారే విధంగా చేస్తుంది. ఈ టెక్నాలజీ మొత్తం ప్రస్తుతం కళ్ళజోడులో పొందుపరిచారు. ఈ కళ్ళజోడు ధరిస్తే చాలు, చదువుకునే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ మరింత అటెన్షన్‌ చూపించగలుగుతారు. అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌ వంటి సమస్యలు ఉన్న వారికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
 
అలాగే హార్ట్‌రేట్‌ గురించి తప్పుడు ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వటం వలన ఒక వ్యక్తి తన ఎమోషన్స్‌ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు ఒక పద్ధతి వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించి హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌ డివైజెస్‌లో కొన్నిసార్లు తప్పుడు ఫలితాలు చూపించే విధంగా ఏర్పాటు చేస్తారు. అలాగే మరి కొంతమంది పరిశోధకులు, ఒక వ్యక్తి వినే మ్యూజిక్‌లో అతని దృష్టికి రాకుండా ఒక ప్రత్యేకమైన రిథమిక్‌ ప్యాటర్న్‌ నిక్షిప్తం చేయ్చటం ద్వారా, ఒకవైపు పాటలు వినే సమయంలోనే, అతని మనసులో ఒత్తిడి తగ్గి పరోక్షంగా ఊపిరి తీసుకునే వేగం నెమ్మదించే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
విఆర్‌ థెరపీ
ఈ మధ్యకాలంలో వర్చువల్‌ రియాలిటీ గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం. హైదరాబాద్‌ వంటి నగరాల్లో రకరకాల మాల్స్‌కి వెళ్ళినప్పుడు గేమింగ్‌ జోన్స్‌కి వెళితే తలకు హెడ్‌సెట్‌ తగిలించుకుని ఊహా ప్రపంచంలో గేమ్స్‌ ఆడే వారు కనిపిస్తూనే ఉంటారు. కేవలం గేమ్స్‌ మాత్రమే కాదు వర్చువల్‌ రియాలిటీ అనేక రంగాలలో కీలకమైన మార్పులు తీసుకురాబోతోంది. ముఖ్యంగా హెల్త్‌కేర్‌ రంగంలో కూడా వర్చువల్‌ రియాలిటీ బాగా ఉపకరిస్తుంది. ఉదాహరణకి విఆర్‌ థెరపీనే తీసుకుంటే దృష్టి పరమైన లోపాలు మొదలుకొని ఆటిజం వరకూ ట్రీట్‌ చెయ్యడానికి ఈ టెక్నాలజీ వినియోగించబడుతుంది. కొన్ని సందర్భాలలో కీమోథెరపీ వంటి నొప్పితో కూడిన క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకునే రోగులు, పూర్తి స్థాయిలో నొప్పి అనుభూతి చెందకుండా ఉండటం కోసం చికిత్స సమయంలో వారు వర్చ్యువల్‌ ఎన్విరాన్‌మెంట్‌లో గడిపే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు రకరకాల ఫోబియాలను పారదోలేందుకు వర్చ్యువల్‌ రియాలిటీ టెక్నాలజీ వాడుతున్నారు. వివిధ మానసిక సమస్యలతో బాధపడే వారికి వర్చ్యువల్‌ రియాలిటీ అధారంగా చికిత్స చేసే విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. తలకి ఓ హెడ్‌సెట్‌ తగిలించుకునే ఓ వేరబుల్‌తోనే ఇదంతా సాధ్యమవుతోంది.
 
అలాగే సహజంగా కొంతమంది మహిళలకు పీరియడ్స్‌ సమయంలో పొత్తికడుపులో నొప్పి రావడం, ఆ నొప్పి భరించలేక ఇబ్బంది పడడం తెలిసిందే. ఇలాంటి సమస్యలను పరిష్కరించటానికి కూడా వేరబుల్‌ డివైజ్‌లు వస్తున్నాయి. ఉదాహరణకు ‘లివియా’ అనే ఒక కొత్త ప్రొడక్ట్‌ పరిశీలిస్తే, పొత్తి కడుపు భాగంలో శరీరానికి తగిలే విధంగా ఈ డివైజ్‌ అమర్చుకుంటే ఎలక్ట్రిక్‌ నెర్వ్‌స్టిమ్యులేషన్‌ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ డివైజ్‌ నొప్పిని తగ్గించే విధంగా చేస్తుంది. ఇప్పటివరకు సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండే మందులు వాడటం తప్పించి ఎలాంటి పరిష్కారం లేని అనేక రకాల శారీరక ఇబ్బందులకు వేరబుల్‌ డివైజెస్‌ ద్వారా చాలా సులభంగా పరిష్కారం అందించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు.
 
అల్జీమర్స్‌ను గుర్తించేందుకు..
జ్ఞాపకశక్తికి సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన రుగ్మత అల్జీమర్స్‌. ఈ రుగ్మత మొదలయ్యే సమయంలో ఒక వ్యక్తి నడిచే వేగం, స్థిరంగా నడిచే దూరం, వేసే అడుగులు... ఇలా అన్నీ మారిపోతూ ఉంటాయి. దీన్ని సకాలంలో గుర్తిస్తే గనుక ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకోవచ్చు. సహజంగా అల్జీమర్స్‌ వ్యాధిని నిర్ధారించడం కోసం డాక్టర్లు పేషెంట్ల చేత కొద్దిదూరం నడిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌లలో ఉండే సెన్సార్లని ఆధారంగా చేసుకుని అల్జీమర్స్‌ వంటి వాటిని ముందే గుర్తించగలిగే విధంగా టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నారు.
 
మాట్లాడటంలో..
ఒక వ్యక్తి ఆపకుండా ఎంత సమయం మాట్లాడగలుగుతున్నారు? మధ్యలో ఎన్ని సార్లు ఆగుతున్నారు? ఉచ్చారణ ఎలా ఉంది? వంటి అనేక అంశాల ఆధారంగా అటెన్షన్‌ డిజార్డర్‌, ఇతర స్పీచ్‌ పరమైన లోపాలను గుర్తిస్తుంటారు. ఇటీవల కాలంలో హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో ఉండే గూగుల్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్స వంటి స్పీచ్‌ రికగ్నిషన్‌ టూల్స్‌ ఆధారంగా ఒక వ్యక్తి యొక్క వాయిస్‌ డేటా రికార్డ్‌ చేయడం, దాన్ని విశ్లేషించడం చేస్తున్నారు. వాక్య నిర్మాణంలో ఉండే ఒడిదుడుకులను కూడా ఈ పద్ధతిలో గమనించగలుగుతున్నారు. అలాగే కనుగుడ్డులో వస్తున్న మార్పులు నిశితంగా గమనించడం ద్వారా వివిధ రకాల కంటి సంబంధిత సమస్యలు తెలుసుకునే విధంగా కూడా వేరబుల్‌ కళ్లజోళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి కనురెప్ప వేసే సమయాన్ని, వేగాన్ని, ఏదైనా చదివేటప్పుడు కంటి కదలికలను విశ్లేషించడం ద్వారా కంటి సమస్యలను గుర్తించేందుకు అవకాశం కలుగుతోంది.
 
మిచిగన్‌ యూనివర్సిటీ పరిశోధకులు రక్తంలో క్యాన్సర్‌ కణాలను గుర్తించగలిగే విధంగా ఒక వేరబుల్‌ డివైజ్‌ తయారుచేశారు. అలాగే శరీరానికి తగిలించుకోగలిగే విధంగా, ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే విధంగా ఒక వేరబుల్‌ డయాలసిస్‌ డివైజ్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. వైద్య రంగంలో ఇలాంటి ఎన్నో సరికొత్త మార్పులు లేటెస్ట్‌ వేరబుల్‌ టెక్నాలజీ ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి.
 
నల్లమోతు శ్రీధర్‌
fb.com/nallamothusridhar