ఒబెసిటీని అడ్డుకునే డైటరీ సప్లిమెంట్‌!

ఆంధ్రజ్యోతి(25-4-15): మిర్చి రుచి కోసమే కాదు. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. మిరప గింజలలో ఉండే ‘క్యాప్సైసిన్‌’ అనే పదార్థాన్ని డైట్‌ బేస్డ్‌ సప్లిమెంట్‌గా తీసుకోవడం ద్వారా స్థూలకాయంను నివారించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. అమెరికాలోని యోమింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు స్థూలకాయంను అడ్డుకోవడం కోసం ఒక కొత్త పద్ధతిని అభివృద్ధిపరిచారు. ఇందుకోసం క్యాప్సైసిన్‌ను ఎంచుకున్నారు. ఈ విధానంలో క్యాలరీలను తక్కువ తీసుకునే అవసరం లేకుండానే మెటబాలిజంను స్టిమ్యులేట్‌ చేయడం ద్వారా బరువు పెరగకుండా చూడవచ్చని కనుగొన్నారు. క్యాప్సైసిన్‌ థర్మోజెనెసి్‌సను స్టిమ్యులేట్‌ చేస్తుంది. అంతేకాకుండా వైట్‌, బ్రౌన్‌ ఫ్యాట్‌ సెల్స్‌లో ఉండే రెసిప్టార్స్‌ను యాక్టివేట్‌ చేయడం ద్వారా ఎనర్జీ బర్నింగ్‌కు దోహదపడుతుంది. ఇది స్థూలకాయం రాకుండా చూడటంతోపాటు టైప్‌ 2 డయాబెటిస్‌, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుంది. సాధారణంగా శరీరంలో వైట్‌ ఫ్యాట్‌ సెల్స్‌ ఎనర్జీ స్టోర్‌ చేస్తాయి. బ్రౌన్‌ సెల్స్‌ థర్మోజెనిక్‌ మెషినరీగా ఉపయోగపడతాయి. అంటే నిలువ ఉన్న ఫ్యాట్‌ను బర్న్‌ చేసే పనిని నిర్వర్తిస్తాయి. క్యాలరీలు అధికంగా లభించే ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మెటబాలిజంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది స్థూలకాయంకు దారితీస్తుంది. ప్రస్తుతం పరిశోధకులు ఈ విధానంలో న్యాచురల్‌ డైటరీ సప్లిమెంట్లు తయారుచేసే పనిలో పడ్డారు. ఇవి అందుబాటులోకి వస్తే ఒబేసిటీకి సులభంగా చెక్‌ పెట్టవచ్చనడంలో సందేహం లేదంటున్నారు పరిశోధకులు. స్థూలకాయులకు ఇది శుభవార్తే కదూ.