నిలబడితే లావు తగ్గుతారట!

ఆంధ్రజ్యోతి(9-11-15): కొద్దిసేపు నిలబడితే అబ్బ.. కాళ్లు లాగుతున్నాయంటూ కుర్చీలో కూర్చుంటాం. కానీ నిలబడ్డం కూడా శరీరానికి మంచిదట. రోజూ కొద్దిసేపు నిలబడితే బరువు తగ్గుతామట. ఆశ్చర్యంగా ఉందా? ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. రోజులో కనీసం పావు భాగం సేపు నిలబడితే బరువు తగ్గుతారని సదరు పరిశోధకులు చెబుతున్నారు. కూపర్‌ ఇన్‌స్టిట్యూట్‌, ది యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియా సైంటిస్టులతో కలిసి అమెరికన్‌ కేన్సర్‌ సొసైటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఎక్కువ సేపు నిలబడితే ఎక్కువ ఆరోగ్య ఫలితాలు వస్తాయా లేదా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. తమ స్టడీలో శాస్త్రవేత్తలు స్త్రీ, పురుషులను పరిశీలించారు. పురుషుల విషయానికొస్తే రోజులో పావు భాగంసేపు నిలబడ్డం వల్ల  ఊబకాయం బారినపడే అవకాశాలు 32 శాతం తక్కువుగా ఉందని తేలింది. రోజులో సగం సేపు నిల్చునే వారిలో ఊబకాయం రిస్కు 59 శాతం తగ్గింది. అయితే రోజులో మూడొంతులసేపు నిలుచున్న వారిలో ఊబకాయం రిస్కు తగ్గిన దాఖలాలు లేవు. ఆడవాళ్ల విషయానికి వస్తే రోజులో పావు, అర, మూడొంతుల భాగం నిలబడ్డం వల్ల ఊబకాయం రిస్కు పొట్ట భాగంలో 35, 47, 57 మేర తగ్గింది.

 అయితే పురుషుల్లోగాని, స్త్రీలలో గాని నిలబడడానికి, మెటబాలిక్‌ సిండ్రోమ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్టడీలో తేలింది. వ్యాయామాలు చేసే పురుషుల్లో పావు లేదా అర రోజు నిలుచోవడం వల్ల పొట్ట భాగంలో లావు 57 శాతం తగ్గింది. వ్యాయామాలు నియమంగా చేస్తూ రోజులో ముప్పావు భాగం నిలబడిన మగవారిలో పొట్ట భాగంలోని లావు 64 శాతం తగ్గింది.  అయితే తక్కువ సేపు నిలుచోవడం వల్ల లావు పెరుగుతామా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ, గతంలో చేసిన కొన్ని పరిశోధనల్లో ఎక్కువసేపు నిలబడ్డం వల్ల వెరికోస్‌ వెయన్స్‌ రిస్కు బారిన పడతామని వెల్లడైంది. అందుకే ఎక్కువ సేపు నిలబడ్డం వల్ల ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలేమైనా ఉన్నాయా లేదో తేలడానికి ఇంకా విస్తృతస్థాయిలో  పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.