ఇవీ... ఇప్పటి ట్రెండ్‌

26-12-2018:డ్రెస్‌ల్లోనే కాదు... ఇప్పుడు ఫిట్‌నెస్‌ ప్యాకేజీలోనూ కొత్త ట్రెండ్స్‌ పుట్టుకువస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పాపులర్‌ అవుతున్న ఈ ట్రెండీ వర్కవుట్స్‌ ఫిట్‌నెస్‌ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడూ ఒకే తరహా వ్యాయామంతో బోర్‌గా ఫీలయ్యేవారికి ఇవి మాంచి కిక్‌నిస్తున్నాయి. రాబోయే కొత్త సంవత్సరంలో మీరూ ఈ నయా కసరత్తులు ప్రయత్నించి చూడండి...
 
మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌, బాక్సింగ్‌: ఫిట్‌నెస్‌, బాక్సింగ్‌ కలగలిపి చేయడంలో మజా ఉంటుంది. ఈ వ్యాయామం వల్ల శరీరానికి పూర్తిస్థాయిలో వర్కవుట్‌ లభిస్తుంది. అంతేకాదు కండరాలు పటిష్ఠంగా మారతాయి. క్రమం తప్పకుండా రోజూ ఈ వ్యాయామం చేస్తే బరువు తగ్గుతారు. శారీరక సామర్థ్యం కూడా పెరుగుతుంది.
సస్పెన్షన్‌ ట్రైనింగ్‌: బలమైన తాడు, ఫ్యాబ్రిక్‌ సాయంతో ఈ ఎక్సర్‌సైజ్‌ చేయాలి. శరీర బరువుకు వ్యతిరేక దిశలో చేసే ఈ వ్యాయామానికి తక్కువ స్థలం సరిపోతుంది. కాళ్లు, చేతుల కండరాల దృఢత్వానికి ఇది పరమ ఔషధంగా పనిచేస్తుంది
‘బోసు బాల్‌’ వర్కవుట్‌: ఈ బంతి రెండు వైపులా వ్యాయామం చేయడానికి వీలుగా ఉంటుంది. దీన్నే ‘బోత్‌ సైడ్స్‌ అప్‌’ అని కూడా అంటారు. ఈ బాల్‌ మీద కూర్చొని శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ రకరకాల వ్యాయామాలు చేయొచ్చు. చూడ్డానికి
సులువుగా ఉన్నా... చేయడం కొంత కష్టమే. దీనివల్ల మోకాలి కీళ్లు ధృఢంగా మారతాయి.
హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌: బాడీ షేప్‌ కోసం బరువులు ఎత్తేవారికి ఇది మంచి కిక్‌నిస్తుంది. ఈ ఎక్సర్‌సైజ్‌లో మధ్యమధ్యలో బరువులు పెంచుకుంటూ పోవాలి. మిగతా వర్కవుట్లతో పోల్చితే ఈ వ్యాయామం వల్ల కండరాల సైజు పెరుగుతుంది.
డ్యాన్స్‌ వర్కవుట్‌: జుంబా డ్యాన్స్‌ కలగలిపి వర్కవుట్లు చేయడం మాంచి థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్యాలరీలతో పాటు కొవ్వు కూడా తొందరగా కరిగిపోతుంది. ఆడుతూపాడుతూ చేసే ఈ వ్యాయామం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.