నీళ్లు తాగండి...స్లిమ్‌గా ఉండండి...

ఆంధ్రజ్యోతి(14-6-15): లావుగా ఉన్నవాళ్లు శరీర బరువు తగ్గాలని ఉబలాటపడుతుంటారు. అందుకోసం నిత్యం వ్యాయామాలు చేస్తుంటారు. డైట్‌ పాటిస్తుంటారు. ఇదంతా బాగానే ఉంది. కానీ వీటితోపాటు వీళ్లు నీళ్లు కూడా తాగితే మంచిది. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా? అవును మంచినీళ్లు బాగా తాగితే స్లిమ్‌గా తయారవుతారట. శరీరం బరువు తగ్గుతుందిట. ఆ విశేషాలేమిటో తెలుసుకుందామా...
 

రోజులో మనం ఎన్ని నీళ్లు తాగుతున్నామన్న దానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంది. నీళ్లు ఎక్కువగా తాగితే మన శరీరం బాగా పనిచేస్తుంది. జీవక్రియ బాగా జరుగుతుంది. అలాకాకుండా తక్కువ నీళ్లు తాగితే శరీరంలో రసాయన క్రియలు కూడా సరిగా జరగవు. ఇదంతా ఒక ఎత్తయితే, ఎక్కువ నీళ్లు తాగడం వల్ల శరీర బరువు కూడా తగ్గుతుంది. బాగా ఆకలివేసినపుడు కాలరీలు బాగా ఉన్న ఫుడ్‌ని ఎక్కువగా తినేస్తాం. ఇలాంటి సమయాల్లో ముందుగా ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగామనుకోండి ఎక్కువ ఆహారం కడుపులోకి పోదు. అందుకే ఏదైనా తినే ముందు నీళ్లు బాగా తాగితే తిండి ఎక్కువ తినం. అందుకే నీళ్లు తాగడం ద్వారా తినే ఆహారాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో శరీరంలోకి ఎక్స్‌ట్రా కాలరీలు శరీరం లోపలికి వెళ్లవు. అలాగే అన్నం తినే ముందు కూడా గ్లాసుడు మంచినీళ్లు తాగితే తక్కువ ఆహారం మాత్రమే తింటాం. శరీరం లావు కాదు. నీళ్లు ఎక్కువ తాగుతూ.... రోజులో నాలుగుసార్లు కొద్ది కొద్దిగా ఫుడ్‌ తినడం వల్ల శరీర బరువు పెరగకుండా అదుపులో ఉంటుంది. శాస్త్రవేత్తలు చేసిన ఒక స్టడీలో ఆహారం తినడానికి ముందు మంచినీళ్లు తాగిన వాళ్లు తాము తినే ఆహారంలో 75 క్యాలరీలను తగ్గించుకోగలిగారట. ఈ లెక్కన సంవత్సరానికి 27,375 కాలరీలు తక్కువ తినడం వల్ల నాలుగు కిలోల వరకూ శరీర బరువు తగ్గారు. అంటే ఎలాంటి శారీరక కష్టం లేకుండా కేవలం నీళ్లు తాగడం ద్వారా తమ శరీర బరువును వీళ్లు తగ్గించుకున్నారు. తిన్న ఆహారం సరిగా అరగకపోయినా కూడా బరువు పెరుగుతారు. మంచినీళ్లు బాగా తాగితే తిండి బాగా జీర్ణమవుతుంది. నీరు ఎక్కువ తాగడం వల్ల కిడ్నీలు కూడా బాగా పనిచేస్తాయి. జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. మలబద్దకంలాంటి సమస్యలు తలెత్తవు. 

లావు తగ్గడానికి నీళ్లు కీలకంగా వ్యవహరిస్తాయని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. ఒక స్టడీలో అధికబరువుతో బాధపడుతున్నవాళ్లు, మధ్యవయసులో ఉండి లావుతో బాధపడుతున్న మొత్తం 48 మందిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీరందరికీ తక్కువ కాలరీలున్న ఆహారాన్ని పెట్టారు. కొందరి చేత మటుకు అన్నం తినేముందు 500ఎంఎల్‌ నీళ్లు తాగించారు. మూడు నెలల తర్వాత వీరందరినీ పరిశీలిస్తే అన్నం తినేముందు నీళ్లు తాగని వారికంటే నీళ్లు తాగిన వాళ్లు రెండు కిలోల బరువు తగ్గారని వెల్లడైంది. ఇంకొక స్టడీలో వయసుతోపాటు బరువు పెరిగిన వారిపై నాలుగేళ్లు అధ్యయనం చేశారు. దీంట్లో నీరు ఎక్కువగా తాగేవారు, కూల్‌డ్రింకులకు బదులు నీళ్లను మాత్రమే తాగిన వారు తక్కువ బరువుతో ఉన్నట్టు వెల్లడైంది. ఇంతకూ చెప్పేదేమిటంటే బరువు తగ్గడానికి డైట్‌ పాటిస్తున్న వాళ్లు ఫ్లూయిడ్స్‌ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. నీళ్లను బాగా తాగాలి. సుగర్‌, యాడిటివ్స్‌ లేని ఫ్రూట్‌ జ్యూసులను తీసుకోవాలి. ఫ్రూట్‌ జ్యూసుల్లో పోషకవిలువలు ఉన్నట్టే వెజిటబుల్‌ జ్యూసుల్లో కూడా ఉంటాయి కాబట్టి వెజిటబుల్‌ జ్యూసును కూడా నిత్యం తీసుకోవాలి. వీటిల్లో కాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మీగడలేని పాలు లేదా తక్కువ ఫ్యాట్‌ ఉన్న పాలను తీసుకోవాలి. వీటిల్లో కాలరీలు తక్కువ ఉండి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బ్లాక్‌ కాఫీ, గ్రీన్‌ టీ రెండూ కూడా మంచివే. వీటిల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలరీలు ఉండవు. కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌కు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీటిల్లో కాలరీలు అధికంగా ఉంటాయి, పోషకవిలువలు మాత్రం ఉండవు. అలాగే ఎనర్జీ డ్రింకులకు కూడా దూరంగా ఉండాలి. వీటిల్లో కూడా కాలరీలు అధికంగా ఉంటాయి. ఆల్కహాల్‌ కూడా శరీరానికి మంచిది కాదు. ఇందులో కూడా కాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు శరీర బరువును అదుపులో పెట్టడానికి రోజూ నీళ్లు బాగా తాగాలి.