నడుం పెరగనీయొద్దు...

ఆంధ్రజ్యోతి(19/09/14): ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే మీ నడుం లావు కాకుండా  జాగ్రత్తపడండి. ఈ మాటలు చెప్తున్నది వేరెవరో కాదు. దీనిపై పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నడుం చుట్టుకొలత పెరగకుండా జాగ్రత్తపడాలని వారు సూచిస్తున్నారు. ఈ సూత్రం అన్ని వయసుల వారికే కాదు స్ర్తీ పురుషులిద్దరికీ  వర్తిస్తుందని తెలిపారు.  మనిషి పొడవులో సగానికన్నా తక్కువగా నడుం చుట్టుకొలత ఉండాలని  డాక్టర్‌ మార్గరెట్‌ ఆష్‌వెల్‌ అంటున్నారు. ఈ స్టడీని లండన్‌ కాస్‌ బిజినెస్‌ స్కూల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. భారీ కాయుల జీవిత కాలం వారి ఎత్తు, నడుం చుట్టుకొలతలపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. ఐదడుగుల పది అంగుళాలు పొడవున్న 30 సంవత్సరాల పురుషుడి నడుం చుట్టుకొలత 35 అంగుళాల కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాకాకుండా 42 అంగుళాలు ఉందనుకోండి అంటే అతని   పొడవులో అది 60 శాతం కింద లెక్క. అంటే నడుం కొలత ఆ వ్యక్తి పొడవులో సగాని కన్నా   ఎక్కువ ఉందన్నమాట. దీనివల్ల ఆ వ్యక్తి తన జీవితకాలంలో 1.7 సంవత్సరాలను కోల్పోయినట్టు లెక్క.  ఆడవాళ్లలో కూడా వారి నడుం చుట్టు కొలత వారి పొడవుకి సగానికన్నా ఎక్కువ ఉంటే ప్రమాదమే. యావరేజ్‌ పొడవున్న 30 సంవత్సరాల  మగవాడి నడుం చుట్టుకొలత 56 అంగుళాలుంటే, 20.2 సంవత్సరాల జీవిత కాలాన్ని అతను కోల్పోతాడట. అదే ఊబకాయంతో ఉన్న 30 సంవత్సరాల మహిళ నడుం చుట్టుకొలత 51 అంగుళాలు ఉంటే ఆమె  10.6 సంవత్సరాల  ముందుగానే చనిపోయే ప్రమాదం ఉందట.