మితమే మేలు

ఆంధ్రజ్యోతి(17-11-15): శరీర శ్రమ పూర్తిగా తగ్గిపోయిన ఈ కాలంలో ముప్పూటలా ఫుల్లుగా మెక్కేస్తే ముప్పేనంటున్నారు.. డైటీషియన్లు.  ప్రత్యేకించి రాత్రివేళ అతిగా తినేసే అలవాటు స్థూలకాయం రావడానికి, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు తలెత్తడానికి కారణం అవుతుందని చెబుతున్నారు. ఆరోగ్య శాస్త్రం ప్రకారం, ఉదయం తిన్న ఆహారం మోతాదులో సగం మధ్యాహ్నం, ఇందులో సగం రాత్రివేళ తినాలి. ఎందుకంటే సూర్య గమనానికి జీర్ణశక్తికీ సంబంధం ఉంది. సూర్యోదయం వేళ ఉండే జీర్ణశక్తిలో 60 శాతమే రాత్రివేళ ఉంటుంది. భోజనం మోతాదు కూడా అదే  నిష్పత్తిలో తగ్గుతూ రావాలి. కానీ, ఉద్యోగ వ్యాపారాల ఒత్తిళ్ల కారణంగా  ఉదయం, మధ్యాహ్నం  హడావిడిగా తినేస్తారు. రాత్రివేళ ఆ  ఒత్తిళ్లు  పెద్దగా ఉండకపోవడం వల్ల, మనసు కూడా కుదురుగా ఉండి ఎక్కువగా తినేస్తుంటారు.

‘‘ఏక భుక్తం యోగి, ద్విభక్తం భోగి, త్రిభుక్తం రోగి’’  అన్న ఆరోగ్య సూత్రం ఒకటుంది. వ్యాయామాలు, శరీర  శ్రమ అసలే లేకుండా పోయిన ఈ దశలో ఉదయం, మధ్యాహ్నం చేసిన భోజనాల్లోని కేలరీలే శరీర పోషణకు సరిపోతాయి. అయినా, అంతటితో ఆగక మూడోసారి కూడా తినే సిన తాలూకు కేలరీలు శరీరంలో అదనంగానే ఉండిపోతాయి. అందుకే భోజనానంతరం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే కేలరీలు వాటి తో తయారైన చక్కెర నిలువలు రక్తంలో నిలిచిపోయి మధుమేహానికి దారితీస్తాయి. అందుకే  రాత్రివేళ తీసుకునే భోజనంలో కేలరీలే లేని (కీర లాంటివి) లేదా అతి  తక్కువ కేలరీలున్న ఆహార పదార్థాలుగానీ తీసుకోవడం మేలు. డిన్నర్‌లో తీసుకునే ఆహార పదార్థాలు  ఎక్కువ పీచుపదార్థం, తక్కువ కేలరీలతో ఉండేలా చూసుకోండి.