కొవ్వును తగ్గించే రెసిపీలు

ఆంధ్రజ్యోతి: పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. పెరిగిపోయిన ఫ్యాట్‌ వల్ల జీవక్రియ సరిగా జరగదు.  అందుకే నిత్యం డైట్‌, వ్యాయామాలు చేయడంతోపాటు వంటింట్లో లభించే కొన్ని ఆహారపదార్థాలను రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా చేస్తే పొట్ట చుట్టూ, నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. 
నిమ్మరసం: పొద్దున్నే లేచిన వెంటనే పళ్లు తోముకుని గ్లాసుడు నిమ్మరసం తాగాలి. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో నిమ్మరసం ఉత్తమం. కాలేయంలోని విషపదార్థాలను తొలగించడంలో ఇది బాగా పనిచేస్తుంది. జీర్ణక్రియ సరిగా జరిగేట్టు సహాయపడుతుంది. అందుకే గోరు వెచ్చటి నీళ్లల్లో నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి పొద్దున్నే లేచిన వెంటనే తాగితే శరీరానికి ఎంతో మంచిది. 

అల్లం టీ: అల్లం టీలో వైద్యపరమైన లాభాలెన్నో దాగున్నాయి. గొంతునొప్పి నుంచి బహిష్టు సమయాల్లో వచ్చే నొప్పి దాకా అన్నింటినీ అల్లం టీ తగ్గిస్తుంది.  అల్లం టీ తాగడం వల్ల శరీర బరువు కూడా తగ్గుతారు. అల్లం శరీర ఉష్ణోగ్రతను పెంచి కొవ్వును కరిగిస్తుంది. అందుకే రోజూ అల్లం టీ  తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. హెర్బల్‌ టీలు కూడా శరీర బరువు తగ్గించి స్లిమ్‌ చే స్తాయి. అల్లం టీ తయారుచేయాలంటే మొదట చిన్న అల్లం ముక్కను తీసుకోవాలి. దాన్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఒక కప్పు నీటిని స్టవ్‌ మీద పెట్టి అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసి బాగా మరిగించాలి. కొద్దిసేపు వాటిని ఆ నీటిలోనే ఉంచి ఆ తర్వాత వడగట్టాలి. వడగట్టిన అల్లం నీటిలో  కొద్దిగా తేనె లేదా నిమ్మరసం వేసుకుని తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. శరీరానికి కూడా మంచిది. 

 

వెల్లుల్లి: ఇది ఊబకాయం తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. రోజూ వెల్లుల్లిని నోట్లో వేసుకుని నమలడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా అవుతుంది. అందుకే వెల్లుల్లి రెబ్బలు మూడు నోట్లో వేసుకుని బాగా నమలాలి. ఆ తర్వాత రెడీగా పెట్టుకున్న నిమ్మ రసాన్ని తాగాలి. రోజూ పొద్దున్నే ఖాళీకడుపున ఇలా చేస్తే ఎంతో మంచిది. 

బాదంపప్పులు: బాదంపప్పులను రోజూ తింటే మంచిది. ఇవి కూడా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గిస్తాయి. మిగతా నట్స్‌లాగ కాకుండా బాదం వల్ల శరీర బరువు తగ్గుతుంది. బాదంలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ శరీరంలో పేరుకున్న ఫ్యాట్‌ని తగ్గిస్తాయి. అందుకే రోజూ రాత్రి పడుకోబోయే ముందర 6-7 బాదం పప్పులను నీళ్లల్లో నానబెట్టాలి. పొద్దున్నే లేచి ఆ బాదం పప్పులపైనున్న తొక్క తీసి  తినాలి. 

యాపిల్‌సైడర్‌ వెనిగర్‌: ఇది మీ ఫుడ్‌కు మంచి సువాసననివ్వడమే కాకుండా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది. ఆకలిని బాగా తగ్గిస్తుంది. ఒక గ్లాసుడు నీళ్లల్లో 1 లేదా 2 టేబుల్‌ స్పూన్సు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ని వేసి బాగా కలపాలి. అన్నం తినేముందు ఆ డ్రింకును తాగాలి. 

పుదీనా: పొట్టచుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో ఇది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. పొట్టలోని గ్యాస్‌ సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని యాంటాక్సిడెంట్లు జీవక్రియ సరిగా జరిగేట్టు సహాయపడతాయి. శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. పుదీనా, కొత్తిమీర ఆకుల్ని రెండింటినీ కలిపి బాగా నూరాలి. అందులో నిమ్మరసం వేసి పేస్టులా తయారుచేయాలి. ఆ పేస్టులో చిటికెడు ఉప్పు వేయాలి. రోటి, ఇడ్లీల్లో దీన్ని చెట్నీగా వేసుకుని తింటే జీర్ణశక్తికి ఎంతో మంచిది. పుదీనాలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

కలబంద: పొట్టచుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. శరీర బరువును కూడా తగ్గిస్తుంది. అందుకే రెండు టేబుల్‌ స్పూన్స్‌ కలబంద జ్యూసులో ఒక టీ స్పూను ధనియాల పొడి వేసి బాగా కలపాలి. దీన్ని అరగ్లాసు గోరువెచ్చటి నీళ్లల్లో పోసి బాగా కలపాలి. ఈ డ్రింకును పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగితే ఎంతో మంచిది. దీన్ని తీసుకున్న తర్వాత గంట వరకూ ఏమీ తినకూడదు.