మెటబాలిజం పెరగాలంటే..

30-05-2019: శరీరం శక్తిని ఖర్చు చేసే వేగమే మెటబాలిజం. ఈ వేగం మన ఆహారపుటలపవాట్లు, జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. మెటబాలిజాన్ని పరిగెత్తించగలిగితే, శరీరంలో కొవ్వు పేరుకునే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి అందుకు ఉపయోగపడే అలవాట్లను అలవరుచుకోవాలి. అవేంటంటే....
 
డైటింగ్‌ అవసరమా: డైటింగ్‌తో కడుపు మాడ్చుకుంటూ, హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌ చేస్తే, అందుకు సరిపడా శక్తి అందక బలహీనపడతాం. ఇందుకు కారణం డైటింగ్‌ సమయంలో, శక్తిని పొదుపు చేసుకోవడం కోసం శరీర జీవక్రియలను మందగింపజేయాలనే మెసేజ్‌ మెటబాలిజానికి చేరడమే!
నిద్ర సరిపడా: మెటబాలిజం చురుగ్గా ఉండాలంటే కంటి నిండా నిద్ర తప్పనిసరి. కాబట్టి రోజుకు 8 గంటలకు తగ్గకుండా ప్రశాంతంగా నిద్ర పోవాలి.
హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌: వ్యాయామం తర్వాత కూడా మెటబాలిజం వేగంతో పని చేయాలంటే హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌ చేయాలి. దీన్నే ‘ఆఫ్టర్‌ బర్న్‌ వర్కవుట్‌’ అంటారు.
బరువులు ఎత్తాలి: బరువులు ఎత్తడం వల్ల లీన్‌ మజిల్‌ మాస్‌ తయారవుతుంది. కాబట్టి నిద్రావస్థలో ఉన్న మెటబాలిజం మేల్కొనేలా బరువులతో కూడిన వ్యాయామాలు చేయాలి.
ఆహారం: జీర్ణశక్తి మందగించే ఆహారానికి దూరంగా ఉండాలి. ఇలాంటి ఆహారం వల్ల శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌ పెరిగి మెటబాలిజం కుంటు పడుతుంది. కాబట్టి తేలికగా అరుగుతూ, స్వల్ప పరిమాణాల్లో గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేసే ఆహారానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి.