బరువు తగ్గించుకోవడంతో పాటు.. చక్కని ఫిట్‌నెస్‌ కోసం..

బరువు తగ్గడానికి తేలికైన మార్గం అంటూ లేదు. వ్యాయామం, ఉపవాసం... ఈ రెండు మార్గాల ద్వారా అధిక బరువు తగ్గించుకోవడంతో పాటు, చక్కని ఫిట్‌నెస్‌ పొందవచ్చు. ఇందుకోసం....
 
ఉపవాసం: ప్రతి రోజూ 8 గంటల విరామ వ్యవధితో, 16 గంటల పాటు ఉపవాసం పాటించాలి. రాత్రి 8 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉపవాసం పాటించాలి.  రాత్రి 8కి, తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ఆహారం తీసుకోవాలి. ఉపవాస సమయంలో చక్కెర కలపని బ్లాక్‌ కాఫీ, బ్లాక్‌ టీ, నీళ్లు తాగవచ్చు.
 
ఉపవాస విరమణ: శరీరాన్ని చురుగ్గా మార్చడానికి తేలికైన, సులువుగా జీర్ణమయ్యే పదార్థాలతో ఉపవాసాన్ని విరమించాలి. చక్కెరతో తయారైన పదార్థాలు, తీయని పండ్లు తినకూడదు. కొవ్వును తొందరగా కరిగించే కొబ్బరినూనెను తీసుకోవాలి.
 
వ్యాయామం: ఉదయం సమయం వ్యాయామానికి ఉత్తమం. వేగంగా బరువు తగ్గడంతో పాటు, కండరాలు బలపడడానికి అనుకూలమైన వ్యాయామ సమయం ఇదే అని పరిశోధనల్లో రుజువైంది. బరువులతో కూడిన వ్యాయామాలు, గుండె వేగాన్ని పెంచే ఎక్సర్‌సైజ్స్‌, హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌ తప్పక చేయాలి. ఒకే రకమైన వ్యాయామాలు కాకుండా, తరచుగా మారుస్తూ, తీవ్రత పెంచుతూ, తగ్గిస్తూ విభిన్నమైన వర్కవుట్స్‌ చేయాలి.
 
వారంలో ఐదు రోజులు: వారం మొత్తం ఒక్క రోజు కూడా విడవకుండా వ్యాయామాలు చేయడం ఉత్తమం. అయితే అలా వీలుకాని పక్షంలో వారంలో కనీసం ఐదు రోజుల పాటు అయినా క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్స్‌ చేయాలి. వ్యాయామ ప్రభావానికి స్పందించేలా శరీరాన్ని అలవాటు చేయడం ఎంతో అవసరం!