ఇలా పరుగెత్తాలి!

 

ఆంధ్రజ్యోతి (06-01-2020):వ్యాయామంలో భాగంగా పరుగునూ ఎంచుకోవచ్చు. అయితే తగిన ఫలం దక్కాలన్నా, ఇతరత్రా ఇబ్బందులేవీ తలెత్తకుండా ఉండాలన్నా కొన్ని నియమాలు పాటించక తప్పదు. అవేమిటంటే....
 
 ఒకేసారి ఎక్కువ దూరాలు లక్ష్యంగా పెట్టుకోకూడదు. రోజూ పరిగెత్తే దూరంలో 10ు చొప్పున ప్రతి వారం పెంచుకుంటూ పోవాలి.
 
 ఒకవేళ పరుగు కొత్తగా మొదలుపెట్టిన వారైతే దూరాలు పెంచడం మీద కన్నా, క్రమం తప్పక రోజూ ఒకే దూరం పరిగెత్తడం శరీరానికి అలవాటు చేయాలి.
 
 పరుగుకు ముందు శరీరాన్ని అందుకు సిద్ధం చేసే వామప్‌ వ్యాయామాలు, పరుగు తర్వాత కూల్‌ డౌన్‌ వ్యాయామాలు తప్పక చేయాలి.
 
 శక్తికి మించి పరుగెత్తడం సరికాదు. ఇలా ఎవరికి వారు తమ పరుగు సామర్ధ్యాన్ని తెలుసుకోవాలంటే, పరిగెత్తేటప్పుడు మాట్లాడాలి. మాటల మధ్యలో వ్యవధి తీసుకుంటూ మాట్లాడగలిగితే, తగిన వేగంతో మీ సామర్ధ్యానికి తగ్గట్టు పరుగెత్తుతున్నారని అర్థం. అలాకాకుండా ప్రతి మాటకు రొప్పుతూ, మాట్లాడలేకపోతుంటే శక్తికి మించి శరీరాన్ని శ్రమకు లోను చేస్తున్నారన్న మాట. అలాంటప్పుడు వేగం తగ్గించాలి.
 
 పరుగుకు మూడు గంటల ముందు ఎలాంటి ఘనాహారం తీసుకోకూడదు. పరుగు తర్వాత గంటలోగా పిండిపదార్థాలు, ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి.
 
 పరుగుకు ముందూ తర్వాతా, పరుగెత్తే సమయంలో నీళ్లు తాగాలి.