అలా కూర్చుంటే కుదరదు!

08-01-2019: ఈ డిజిటల్‌ యుగంలో దాదాపు ప్రతి ఉద్యోగానికీ కంప్యూటర్‌పై పనిచేయడం అనివార్యమైంది... ముఖ్యంగా నవతరానికి! అయితే గంటల కొద్దీ కంప్యూటర్‌ ముందు కూర్చోవడంవల్ల అలసట, తలనొప్పి, కండరాల మీద ఒత్తిడి పడుతుందంటున్నారు శాన్‌ఫ్రాన్‌సిస్కో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ‘బయో ఫీడ్‌బ్యాక్‌ జర్నల్‌’లో వచ్చిన ఈ అధ్యయన సారాంశమేమంటే... నిటారుగా కూర్చోవడం వల్ల వెన్నెముక కండరాలు మెడ, తల బరువును సపోర్టు చేస్తాయి. ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు మెడ కండరాలు 5 కిలోల బరువును భరిస్తాయన్నమాట. అలాకాకుండా తలను 45 డిగ్రీలో ముందుకు వంచి కూర్చుంటే మెడ భాగంపై అదనపు బరువు పడుతుందని చెబుతున్నారు ప్రొఫెసర్‌ ఎరిక్‌ పెపర్‌. సరిగ్గా కూర్చోకపోవడం వల్ల మెడ, తల భాగం మీద 20 కిలోల అదనపు బరువు పడుతుందట. దాంతో మెడ కండరాలు పట్టేసి, వెన్నెముకలో నొప్పి వస్తుంది.
 
అధ్యయనంలో భాగంగా 87 మంది విద్యార్థుల మీద పరిశోధన చేశారు. కంప్యూటర్‌ ముందు విద్యార్థులను మెడ, తల భాగం నిటారుగా ఉండేలా కూర్చోమన్నారు. అందర్నీ మెడలు తిప్పి, తలను ముందుకు కదిలించమన్నారు. 92 శాతం మంది తమ మెడను సులువుగా తిప్పారు. రెండో పరీక్షలో 125 మంది విద్యార్థులు 30 సెకన్ల సమయం తీసుకున్నారు. వీరిలో 98శాతం మంది తల, మెడ, కళ్లు నొప్పి పుట్టాయని చెప్పారు. వారిలో 12 మంది విద్యార్థులను ఎలక్ర్టోమయోగ్రఫీ పరికరం ద్వారా పరిశీలిస్తే... తలను ముందుకు కదిలించినప్పుడు మెడ వెనక భాగంలో ఉండే ట్రపేజియస్‌ కండరం మీద ఒత్తిడి పడినట్లు గుర్తించారు పరిశోధకులు. కాబట్టి కంప్యూటర్‌పై ఎక్కువ సేపు పనిచేసేవారు తల, మెడ ఒకే పొజిషన్‌లో ఉంచి పని చేసుకోవాలి. స్ర్కీన్‌ మీద అక్షరాల సైజును పెద్దగా చేసుకోవడం, కంప్యూటర్‌ రీడింగ్‌ అద్దాలు ధరించడం, కంప్యూటర్‌ను కళ్లకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.