వ్యాయామం తరువాత నీరు తాగకూడదా?

21-03-2019:  శరీరం అలసిపోయేట్టు వ్యాయామం చేసిన తరువాత మంచినీళ్ళు తాగాలని, దాంతో కండరాల నొప్పులు ఉండవన్నది పాత థియరీ. అయితే వ్యాయామం తరువాత మంచి నీరు తాగితే కండరాలు, కీళ్ళ నొప్పులు మరింత పెరుగుతాయని పరిశోధకులుంటున్నారు. వాటర్ బదులు ఎలక్ట్రాల్ వంటి డ్రింక్స్ తాగడం మంచిదని, వీటిలోని మినరల్స్ నొప్పుల నివారిణిగా పని చేస్తాయని ఆస్ట్రేలియాలోని ఎడిత్ నోవన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వీరు పది మంది యువతీ యువకుల మీద పరిశోధన నిర్వహించారు. వీరిని ట్రెడ్మిల్ మీద నడిపించి వాళ్ళు చెమటలు కక్కేంతవరకు వ్యాయామం చేయించారు. వీరిలో కొంతమందికి నార్మల్ వాటర్‌ను, మరికొంతమందికి ఎలక్ట్రో లైట్స్‌తో కూడిన పానీయాలను ఇచ్చి చూసినప్పుడు తేడా స్పష్టంగా కనిపించింది. ఈ పానీయాల్లో సాల్ట్, పొటాషియం. బైకార్బొనేట్, క్లోరైడ్ వంటి మినరల్స్ కారణంగా..వీటిని తాగినవారు ఎలాంటి నొప్పుల బారిన పడకుండా ఉన్నట్టు తేలింది. వ్యాయామం అనంతరం ఎలక్ట్రాల్ వంటి డ్రింకులు తాగడమే మంచిదని వారు స్పష్టం చేస్తున్నారు.