వర్కవుట్స్‌ తర్వాత ఈ డ్రింక్స్‌తో ముప్పు!

06-03-2019: వర్కవుట్స్‌ చేసినప్పుడు చెమట రూపంలో ఒంట్లోని నీరు బయటకు పోతుంది. బాడీ డీహైడ్రేషన్‌కు లోనవకుండా నీళ్లు లేదా కూల్‌డ్రింక్స్‌ తాగుతాం. అయితే వ్యాయామాల ముందుగానీ, తర్వాతగానీ సోడా లేదా కార్బోనేట్‌ ఉండే పానీయాలు తాగడం వల్ల మూత్రపిండాలకు ముప్పు వాటిల్లుతుందని ఒక అధ్యయనంలో తేలింది. సోడా ఉండే సాఫ్ట్‌ డ్రింక్స్‌ తాగినప్పుడు శరీరంలో వేడి పెరిగి, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదముంది. ఆరోగ్యవంతులైన 12 మందికి నాలుగు గంటల వర్కవుట్‌ సెషన్లో రెండు లీటర్ల సోడా, కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌ ఇచ్చారు. వీరిలో సగం మందికి నీళ్లు, మిగతా వారికి సోడా వాటర్‌ ఇచ్చారు. ఇంటికి వెళ్లాక కూడా వారిని ఇదేరకమైన డ్రింక్‌ తీసుకొమ్మని చెప్పారు. సోడా తాగిన వారిలో 75శాతం మందిలో మూత్రపిండాల్లో ఇన్‌ఫెక్షన్లు రావడం గమనించారు. నీళ్లు తాగిన వారిలో కేవలం 8 శాతం మందిలో ఈ సమస్యను గుర్తించారు పరిశోధకులు.