క్రాష్‌ డైట్‌తో స్లిమ్‌గా...

ఆంధ్రజ్యోతి(30/10/14): లావుగా ఉన్నారని ఎవరైనా అంటే చాలామంది తెగ బాధపడిపోతారు. యుక్తవయసులో ఉన్న అమ్మాయిలైతే తమ శరీరాకృతి విషయంలో  ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తుంటారు. పెళ్లి, పార్టీల్లాంటి సందర్భాలలో నలుగురిలో సన్నగా... నాజూగ్గా కనిపించాలని ఉబలాటపడిపోతుంటారు. అందుకోసం క్రాష్‌ డ్డైట్లు చేస్తుంటారు. అయితే క్రాష్‌ డైట్లు నిజంగా సత్ఫలితాలను ఇస్తాయా  అంటే పూర్తిగా అవునని గాని లేదా కాదని గాని  చెప్పలేము. క్రాష్‌ డైట్లను పద్ధతి ప్రకారం చేయాలి. అలా చేయకపోతే మాత్రం పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రాష్‌ డైట్ల వల్ల ఎదురయ్యే లాభనష్టాల గురించి ఈ వారం తెలుసుకుందాం... 
క్రాష్‌ డైట్లలో ఎన్నో రకాలు...
మూడు రోజులు పళ్లు, కూరగాయలు తినడం.
వారం రోజులు పళ్లు, కూరగాయలు, ప్రొటీన్లు తీసుకోవడం.
కేబేజి సూప్‌ డైట్‌గా తీసుకోవడం.
కమలాపండు జ్యూసు డైట్‌గా  తీసుకోవడం
అధిక ప్రొటీన్లున్న డైట్‌ తినడం.
అట్కిన్స్‌ డైట్‌ తీసుకోవడం వంటి ఎన్నో క్రాష్‌ డైట్లు ఉన్నాయి. 
ఎందుకు క్రాష్‌ డైట్‌ చేయాలనుకుంటారు?
పెళ్లి చేసుకోబోయేముందర సన్నగా కనిపించడానికి క్రాష్‌ డైట్లు చేస్తారు. ఇంట్లో పెళ్లిళ్లలాంటి శుభ సందర్భాల్లో కూడా నలుగురిలో నాజూగ్గా కనిపించడానికి కొంతమంది క్రాష్‌ డైట్లు చేస్తారు. మోడల్స్‌  ఫోటోల్లో స్లిమ్‌గా కనిపించడానికి  చే స్తారు.   టీనేజర్లయితే కాలేజీలో చేరేముందర నాజూగ్గా కనిపించడానికి ఇలా చేస్తుంటారు. కొత్తగా జాబ్‌లో చేరుతున్నప్పుడు కూడా కొంతమంది దీన్ని ఫాలో అవుతారు. కారణం ఏదైనప్పటికీ వేగంగా లావు తగ్గాలన్న కోరికతో  క్రాష్‌ డైట్లను చాలామంది అనుసరిస్తుంటారు.
క్రాష్‌ డైట్‌ ఎలా చేయాలి?
సాధారణంగా క్రాష్‌ డైట్లలో సరిపడినంత విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఉండవు. అందుకే మల్టీవిటమిన్‌ మాత్ర, ఐరన్‌, కాల్షియం సప్లిమెంట్లను తప్పనిసరిగా తీసుకోవాలి. క్రాష్‌ డైట్ల వల్ల శరీరంలో  కొంత నీరు కోల్పోతాం. దాంతో పాటు కొంతమేర లవణాలు కూడా బయటకు పోతాయి. అందుకే చక్కెర వేయని పల్చటి జ్యూసులను బాగా తాగాలి. పల్చటి మజ్జిగ కూడా మంచిదే. కొబ్బరినీళ్లు తాగొచ్చు.   వీటిని తీసుకోవడం వల్ల   శరీరం కోల్పోయిన లవణాలు తిరిగి పొందుతుంది. క్రాష్‌ డైట్ల ప్రభావం కండరాలపై కూడా బాగా ఉంటుంది.   బరువు తగ్గుతారు. కానీ ఈ రకంగా బరువు తగ్గడం ఆరోగ్యకరం కాదు. ఎందుకంటే కండరాల మాస్‌ వల్లే మనం ఎనర్జిటిక్‌గా ఉండగలుగుతాం. తిరగ గలుగుతాం. ఎక్కువ కాలం జీవించగలుగుతాం. అందుకే కండరాల మాస్‌ను కోల్పోకుండా ఉండేదుకు సరిపడినంత ప్రొటీన్లను తీసుకోవాలి. రోజూ 0.75 గ్రాముల ప్రొటీన్‌ తప్పనిసరిగా తీసుకోవాలి.  గుడ్లు, నాన్‌వెజ్‌, పన్నీర్‌, నట్స్‌ లాంటివి తింటే శరీరానికి కావలసినన్ని ప్రొటీన్లు అందుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రాష్‌ డైట్‌ అంటే  తినే తిండిని తగ్గించుకోవడమని అర్థం కాదు. క్యాలరీలను తగ్గించుకుంటూ తగినంత ఆహారం తీసుకోవాలి. ఆహారం కొద్ది కొద్దిగా నాలుగైదుసార్లు తినడం మంచిది. క్రాష్‌ డైట్‌ వల్ల శరీరంలో షుగర్‌ పరిమాణం పడిపోవచ్చు. దీంతో తలనొప్పి, అసహనంగా ఉన్నట్టు ఫీలవుతాము. అలా కాకుండా నాలుగైదుసార్లు కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్‌  పడిపోదు. న్యూట్రిషనిస్టు సహాయంతో   డైట్‌ని ప్లాన్‌ చేసుకోండి.  బరువు తగ్గిన తర్వాత ఎప్పుడూ తినే పద్ధతిలో ఆహారం తీసుకోవచ్చా అనే సందేహం  కలుగుతుంటుంది.  తగ్గిన బరువు పెరగకుండా ఉండాలంటే కింద చెప్పిన విధంగా చేయాలి.
మూడు నెలలపాటు డైట్‌ చేయాలి.
తగ్గిన బరువు పెరగకుండా  తర్వాత  ఆరు నెలల కూడా అలాగే ఉండేట్టు జాగ్రత్తవహించాలి.
కొన్నిరోజులపాటు క్రాష్‌ డైట్‌ చేసిన వాళ్లు తమ శరీరం అదే బరువులో కొనసాగాలనుకుంటే మూడు నెలలు అవే  డైట్‌ పరిమితులను పాటించాలి. కాలరీలు తగ్గించడం వల్ల ఆటోమేటిక్‌గా బరువు కూడా తగ్గుతారు. అందుకే ఎలాంటి డైట్‌ తీసుకున్నా, వ్యాయామాలు చేస్త్తున్నా క్యాలరీల్లో తేడాపాడాలు లేకుండా చూసుకోవాలి.  
 
డా.జానకి
న్యూట్రిషనిస్టు,
హైదరాబాద్‌