పిక్కల్లో నొప్పి వస్తోందా

ఆంధ్రజ్యోతి,12-9-2016: మార్నింగ్‌ వాకింగ్‌ వెళ్లే సమయంలో ఒక్కోసారి పిక్కలు పట్టేయవచ్చు. వేగంగా నడుస్తున్నంత సేపు నొప్పి ఇంకా పెరిగిపోవడం, ఆగిపోగానే ఉపశమనంగా అనిపించడం కొందరికి బాగా అనుభవమే. తరుచూ ఈ సమస్య ఎదురవుతున్నప్పుడు చాలా మంది వాకింగ్‌ మానేస్తారే తప్ప వైద్యుణ్ని మాత్రం సంప్రదించరు. ఇలా తరుచూ పిక్కల్లో నొప్పి రావడాన్ని వైద్య పరిభాషలో పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌ (పీఏడి) అంటారు. ఈ వ్యాధి రావడానికి కాళ్లల్లో వాపు రావడం, రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకు ఏర్పడటం లేదా రక్తనాళాలు బాగా బలహీనమై పోవడమో కారణం కావచ్చు. గుండెపోటు గురించిన అవగాహన ఎంతో మందికి ఉంది.

కానీ, కాలిపోటు గురించిన అవగాహన మాత్రం లేదు. ఎండో వాస్కులర్‌ సర్జరీ విభాగపు అధిపతి డాక్టర్‌ డి. ఆర్‌ కామెర్కర్‌ ఈ విషయమై మాట్లాడుతూ ‘‘ పీఏడి పేషంట్లు సాధారణంగా పిక్కలు, తుంటి నొప్పులకు గురవుతుంటారు. ఈ సమస్యను తొలుత ఆర్టీరియల్‌ కాల్కుడేషన్‌గా పిలుస్తారు. పిక్కల్లో నొప్పి చాలా ఎక్కువైనప్పుడు పాదాల్లో నిరంతరంగా మంట కూడా రావచ్చు. కాలివేళ్ల రంగు మారి ఒక దశలో గాంగ్రిన్‌ సమస్య కూడా తలెత్తవచ్చు. కొందరి కాలి భాగాలు పొడిబారిపోవడం, కాళ్ల మీదున్న వెంట్రుకలు రాలిపోవడం వంటి లక్షణాలు కూడా ఈ వ్యాధిలో కనిపిస్తాయి. చివరికి 500 మీటర్ల దూరం నడిచినా పిక్కల్లో, తుంటిలో, పిరుదు భాగాల్లో నొప్పి వస్తోందీ అంటే సమస్య తీవ్రంగా ఉందని గ్రహించి వెంటనే డాక్టర్‌ ను సంప్రదించడం అవసరం’’ అన్నారు.

పీఏడీ సమస్య మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్న వారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అతిగా పొగ తాగే వారిలోనూ ఈ సమస్య ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ సమస్యను తరుచూ పల్స్‌ ఎగ్జామినేషన్‌ చేయించడం ద్వారానే నియంత్రించడం సాధ్యమవుతుంది. దీనితో పాటు కలర్‌ డాప్లర్‌ పరీక్ష, అవసరమైనప్పుడు యాంజియోగ్రఫీ చే యాల్సి ఉంటుంది. అయితే, పీఏడి దుష్పరిణామాలకు గురికాకుండా ఉండడానికి మధుమేహాన్ని, అధికరక్తపోటును, కొలెసా్ట్రల్‌ నిలువలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. పొగతాగడం పూర్తిగా మానేయడం కూడా అంతే అవసరం.