నడక వేగం తగ్గిందా?

ఆంధ్రజ్యోతి (14-11-2019): నాలుగు పదులు దాటిన కొందరిలో నడక వేగం బాగా తగ్గిపోతుంది. చూసే వారికి ఆ వయసులో అది మామూలే అనిపించవచ్చు. కానీ, ఎప్పుడో 70 ఏళ్లు దాటాక ఆ పరిస్థితి వస్తే సరే గానీ, 40- 45 ఏళ్ల వయసులోనే నడక వేగం తగ్గడం, శరీరంలో బీజం వేసిన కొన్ని రకాల రుగ్మతలకు అది నిదర్శనమని పరిశోధకులు చెబుతున్నారు. ‘జామా నెట్‌వర్క్‌ ఓపెన్‌’ అనే ఓ జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసంలో ఈ వివరాలే ఉన్నాయి. ఈ పరిశోధకులు నడక వేగం తగ్గిన వారిని పరీక్షించినప్పుడు వారిలో ఎక్కువ మంది దృష్టి లోపం, వినికిడి లోపం, నరాల బలహీనతలతో వచ్చిన కొన్ని మానసిక రుగ్మతలు, కండరాలు ఎముకల వ్యవస్థ తాలూకు పలురకాల అనారోగ్య సమస్యలతో ఉన్నట్లు కనుగొన్నారు. వీటితో పాటు శ్వాసకోశాలు, గుండె రక్తనాళాల్లో ఏర్పడిన కొన్ని ఆటంకాలు, సంతాన, లైంగిక సమస్యలు కూడా వీరిలో ఉన్నట్లు వారు కనుగొన్నారు. నిజానికి మనిషి జీవిత కాలంలో 45 ఏళ్లు పెద్ద వయసేమీ కాదు. కానీ, నడక వేగం తగ్గిన వారు ఆ వయసుకే పెద్దవాళ్లయినట్లు అనిపిస్తారు.
 
వార్ధక్య లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. వీరి స్కానింగ్‌ రిపోర్టులు చూస్తే, వీరిలో మెదడు పరిమాణం కొంత తగ్గిపోయి కేంద్ర నాడీ రక్తనాళాలు మందంగా మారడం కనిపిస్తుంది. పైగా మెదడు ఉపరిభాగం కూడా తగ్గిపోయి ఉంటుంది. దీనికి తోడు గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి దెబ్బతిని ఉంటాయి. వేగంగా నడిచే వారితో పోలిస్తే వీరిలో శ్వాసకోశాలు కుంచించుకుపోవడంతో పాటు, వ్యాధి నిరోధక శక్తి ఎన్నో రెట్లు తగ్గిపోయి ఉండడం పరిశోధకులు గమనించారు. మోకాలు కీళ్లనొప్పుల వల్ల నడక వేగం తగ్గడం వేరు. అలాంటిదేమీ లేకుండానే నడక వేగం తగ్గిందీ అంటే, వారు పలురకాల కీలక అవయవాల సమస్యలతో బాధపడుతున్నారని భావించాలి. ఆ వెంటనే మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ లాంటి పరీక్షలు చేయించి ఏ శరీర భాగంలో ఏ సమస్య ఉందో తెలుసుకోవడం అవసరం. ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నట్లు బయటపడితే వెంటనే వైద్య పరీక్షలు తీసుకోవడం కూడా అంతే అవసరం. అంతే తప్ప నలభై ఏళ్ల వయసుకే నడక వేగం తగ్గినట్లయితే ఏదోలే అనుకుని నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టవుతుందని అంటున్నారు పరిశోధకులు.