జిమ్‌ చేస్తున్నారా..?

16-05-2019: సాధారణంగా వర్కవుట్‌ చేసిన తర్వాత రోజు ఒంటి నొప్పులు వేధిస్తాయి. కానీ వర్కవుట్‌ అలవాటు అయ్యే వరకే ఈ నొప్పులన్నీ! అలాకాకుండా రోజుల తరబడి నొప్పులు వేధిస్తున్నాయంటే, మీరు తీసుకునే డైట్‌ సరిగా లేదని అర్థం చేసుకోవాలి.
 
ఎలాంటి వ్యాయామం చేసినా, కండరాలు ఎంతో కొంత అలసటకు గురవుతాయి. మరీ ముఖ్యంగా బరువులతో కూడిన వ్యాయామాలు చేసినప్పుడు కండరాలు ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. దాంతో వ్యాయామం తదనంతరం తప్పనిసరిగా మాంసకృత్తులతో కూడిన ఆహారం తీసుకోవాలి. కొంతమంది మరీ ఆలస్యంగా రాత్రి వేళ జిమ్‌కు వెళ్తూ ఉంటారు. వ్యాయామం చేసి వచ్చిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకుండానే నిద్రపోతారు. దాంతో ఉదయం భరించలేని ఒంటి నొప్పులతో నిద్ర లేస్తారు. ఇదంతా అలసిన కండరాలకు సరిపడా శక్తి సమకూరకపోవడం వల్లనే! ఇలా జరగకుండా ఉండాలంటే సాయంత్రం ఎంత ఆలస్యంగా వర్కవుట్స్‌ చేసినా, గుడ్లు, ఇతరత్రా మాంసకృత్తులతో కూడిన ఆహారం తినాలి. ఇలా చేస్తే తిరిగి వర్కవుట్‌ చేయడానికి సరిపడా శక్తి కూడా సమకూరుతుంది.