వంటింట్లో ఉండే పదార్ధాలతోనే కళ్ళ మంటలను తగ్గించుకోండిలా..!

బెంగళూరు, 19-09-2018: వాతావరణ కాలుష్యం దెబ్బకు నగరంలో ఇటీవలి కాలంలో కళ్ళ మంటలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాతావరణ కాలుష్యంతో పాటు ఎక్కువ సమయం కంప్యూటర్లతోనూ, స్మార్ట్‌ఫోన్‌లతోనూ గడపడం వంటివి కారణాలని వైద్యనిపుణులు సెలవిస్తున్నారు. కళ్ళు మంటగా ఉంటే నిర్లక్ష్యం చేయడం సరికాదని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్య పరిభాషలో కళ్ళ మంటలకు అలర్జీ కూడా ఒక కారణంగా ఉంటుందని దుమ్ము ధూళి కారణంగా ఈ సమస్య కనిపిస్తుంటుందన్నారు. ఆయర్వేద వైద్య విధానంలో చక్కటి చిట్కా ఉందన్నారు.
 
వంటింట్లో అందుబాటులో ఉండే పదార్ధాలతోనే ఉపశమనం పొందవచ్చునన్నారు. బంగాళాదుంపలను బద్దలుగా కోసుకుని, వాటికి కీర దోసకాయక (సౌతెకాయ) ముక్కలను కలుపుకుని బాగా నూరుకుని శుభ్రమైన వస్త్రంలో వేసుకుని కళ్ళ మంటలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో అద్దుకోవాలి. కొద్దిసేపు ఇలా ఉంచుకుని ఆపై దూదిని పాలలో ముంచి కళ్ళను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు రోజ్‌వాటర్‌తో కళ్ళను శుభ్రం చేసుకుంటే మంటలు తగ్గుముఖం పడతాయి. కంప్యూటర్లతో అధికంగా పనిచేసే వారు మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిదన్నారు. చూపు తక్కువగా ఉండి కళ్ళజోడు వినియోగిచేవారు ఇంట్లో ఉన్న సమయంలోనూ కొనసాగిస్తే కంట్లో నీరు రావడం వంటి సమస్యలు ఉండవన్నారు. ఆహార పదార్ధాలలో ఎక్కువగా ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే కళ్ళ మంటల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సమస్య బాగా ఎక్కువగా ఉంటే కంటి వైద్యులను సంప్రదించడం మేలు.