మీ చూపు మీ చేతుల్లోనే..

ఆంధ్రజ్యోతి, 16-06-2015: సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. అన్నారు పెద్దలు. దృష్టిని ప్రసాదించే కళ్లకు అంత ప్రాముఖ్యత ఉంది మరి. మనకు ప్రపంచాన్ని చూపుతున్న కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. మీ దృష్టి బాగుండాలంటే ఈ టిప్స్‌ పాటించండి.
 
  • ఆధునిక కాలంలో వృత్తి ధర్మంలో భాగంగా కళ్లను కంప్యూటర్‌కు అప్పగించేస్తున్నాం. ఇది కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కంప్యూటర్‌పై పని చేస్తున్నప్పుడు 20 నిమిషాలకోమాటు 20 సెకన్లపాటు మీ నేత్రాలకు విశ్రాంతినివ్వండి. అతినీలలోహిత కిరణాల నుంచి మీ కళ్లను కాపాడేందుకు యువి గాగుల్స్‌ వాడితే మరీ మంచింది. కంప్యూటర్‌ మానిటర్‌కు కనీసం 50 సెంటీమీటర్ల దూరంలో ఉండేలా చూసుకోండి. టివి నుంచి కనీసం రెండున్నర మీటర్ల దూరాన్ని మెయింటేన్‌ చేయండి. 
  • యువి కిరణాలు, దుమ్ము, ధూళి నుంచి రక్షణ పొందడానికి సన్‌గ్లాసెస్‌ వాడితే మంచిది. 
  • పొగరాయుళ్లకు కంటి జబ్బులు వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ధూమపానం వల్ల నరాల్లోకి చేరే నికోటిన్‌ చూపుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కంట్లో ప్రెషర్‌ పెరిగి కాట్రాక్ట్‌ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మీ చూపు పదికాలాలు చల్లగా ఉండాలంటే ధూమపానానికి స్వస్తి పలకండి. 
  • హెల్దీ డైట్‌ తీసుకోకపోతే దాని ప్రభావం మీ చూపుపై పడే ప్రమాదం ఉంది. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. పళ్లు కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కళ్లలో పొడిబారే గుణం తగ్గి మీ నేత్రాలు కాంతివంతంగా తయారవుతాయి. క్యారెట్‌, కీరాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. మీరు తీసుకునే నీటి పరిణామం తగ్గితే.. మీ కళ్లలో ఉండే తడి కూడా తగ్గుతుంది. తద్వారా కనుగుడ్డుపై ఒత్తిడి పెరుగుతుంది. 
  • చూపులో ఏ మాత్రం తేడా ఉన్నా.. వెంటనే కంటి వైద్యుడ్ని సంప్రదించండి. ఎవరో ఏదో అనుకుంటారని కళ్లజోడును ధరించడంలో అశ్రద్ధ వహిస్తే.. సమస్య పెరుగుతుందే కానీ తగ్గదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలి. షుగర్‌ను నియంత్రణలో ఉంచుకుంటే మీ చూపు దెబ్బతినదు.