కళ్లు జాగ్రత్త

ఆంధ్రజ్యోతి, 02/01/2014: మారుతున్న జీవన శైలి కారణంగానో, పోషకాహార లోపం కారణంగానో, ఒత్తిడి కారణంగానో ఎంతోమంది ప్రస్తుత కాలంలో శుక్లాలు, నీటి కాసుల వంటి కంటి సమస్యలతో బాధపడుతున్నారు. మనిషి అనుభవిస్తున్న ప్రతి ఒత్తిడీ కళ్లను ప్రభావితం చేస్తోంది. అందుకే కళ్లు కాపాడుకోవడంలో కంటి సమస్యల గురించి అవగాహన, ప్రత్యేక శ్రద్ధ అవసరం అంటున్నారు డాక్టర్లు. 

వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత కాలంలో అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిళ్లన్నీ మొదట ప్రభావం చూపించేది కళ్లపైనే. నిద్రలేమి, అలసట, ఒత్తిడి, దిగులు, ఆందోళన... కంటి సమస్యలకు ఇలాంటి కారణాలెన్నో! అయితే, మన నిర్లక్ష్యమే కొన్నిసార్లు కంటి సమస్యలు పెద్దవి కావడానికి కారణం అవుతోంది.

కళ్లజోడే శ్రీరామ రక్ష 
మన కళ్లు పాడవడంలో సూర్యుడి నుంచి ప్రసరించే అతినీలలోహిత కిరణాలది ముఖ్య పాత్ర. అందుకే బయట ఎండలో తిరిగేటప్పుడు అల్ట్రావయొలెట్‌ కిరణాల నుంచి రక్షించుకునేందుకు సన్‌గ్లాసెస్‌ వాడటం మంచిది. గాలిలో ఉండే దుమ్ము, ధూళి వంటివి కంటి శుక్లపటానికి ఇబ్బంది కలిగిస్తాయి. వాటి బారిన పడకుండా ఉండాలన్నా ఇలాంటి కళ్లజోడు వాడటమే ఉత్తమం.
 
ఎదురుగాలి నుంచి 
ప్రయాణంలో ఎదురుగాలి వీచడం వల్ల కంట్లో తేమ ఆవిరవుతుంది. ఫలితంగా కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో కంటి చూపు మందగించే అవకాశం ఉంది. ఎదురుగాలి నుంచి కాపాడుకోవడానికీ కళ్లద్దాలే మార్గం. లాప్‌టాప్‌లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్లకు విశ్రాంతి ఉండదు. తదేకంగా చూస్తూ పనిచేయడం వల్ల కళ్లు అలిసిపోతాయి. మండుతాయి. తద్వారా చూపు మందగించవచ్చు. యాంటిగ్లేర్‌ గ్లాసెస్‌, పోలరైజ్డ్‌ సన్‌గ్లాసెస్‌ వాడితే కంప్యూటర్‌, సూర్యకాంతి, అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లకు కొంతమేరకు రక్షణ ఉంటుంది. కంటిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.
 
విశ్రాంతే ప్రధానం 
కళ్లను కాపాడుకోవటంలో మొదట చేయాల్సిన పని కళ్లకు విశ్రాంతినివ్వటం. కళ్లకు విశ్రాంతి చాలా ముఖ్యం. చేసేది ఏ పనైనా సరే., మధ్యమధ్యలో అంటే ప్రతి పది నిమిషాలకోసారి కళ్లను ఓ నిమిషం పాటు మూసుకొని ఉంచాలి. ఈ విషయంలో కంప్యూటర్‌తో పనిచేసేవాళ్లు ఎక్కువగా జాగ్రత్తపడాలి. గంటల తరబడి కంప్యూటర్‌ వర్క్‌ చేసేవారు తప్పకుండా కంటి రెప్పలను ఆడిస్తూ ఉండాలి. కళ్లపై ఎక్కువ కాంతి పడకుండా చూసుకోవాలి. తగినంతగా కాంతి ఉండేలా చూసుకోవాలి. ఆ జాగ్రత్తలు పాటించకపోతే కళ్లు అధిక శ్రమకు, ఒత్తిడికి లోనై కంటి చూపు మందగిస్తుంది. 
నిద్రలేమి, ఆందోళన, అలసట, దిగులు, ఒత్తిడి..మొదలైన కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. 
కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి, కళ్లు ఉబ్బటానికి అప్పడప్పుడూ అలర్జీలు కూడా కారణం అవుతాయి. సైనసైటిస్‌ లక్షణాలు కూడా కళ్ల కింద వాపులకు దారితీస్తాయి.
 
కనురెప్పలు ఆడిస్తూ ఉంటే 
కనురెప్పలను ఆడించకుండా తదేకంగా చూడటం వల్ల కళ్లు పొడిబారిపోతాయి. అదే మూస్తూ తెరుస్తూ ఉండటం వల్ల కళ్లలో నీళ్లు చేరి కళ్లు తేమగా ఉంటాయి. అంతేకాదు కళ్లు మూసుకున్నప్పుడు సహజమైన తేమను కలిగి ఉండటం వల్ల కళ్లు శుభ్రపడతాయి కూడా. కాబట్టి తరుచుగా కనురెప్పలను ఆడిస్తూ ఉండాలి.
 
ధూమపానం వలన 
సిగరెట్‌ పొగాకు అతి సమీపంలో ఉండటం కూడా కంటిచూపుకు మంచిది కాదు. సిగరెట్‌ పొగబారిన పడ్డవారిలో కళ్లు ఎర్రబడట, నీరు కారడం, కళ్లు ఉబ్బడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. 
రాత్రి నిద్రపోయే ముందు తల ఎత్తులో ఉండేందుకు తల కింద రెండు దిండ్లు పెట్టుకుని పడుకుంటే కళ్ల కింద నీరు చేరదు. వాపు ఏర్పడదు. రాత్రికి రాత్రే కళ్లలోని ద్రవాలు ఆరిపోతాయి. 
కంటి కండరాలు బలహీనమైతే చూపు త్వరగా మందగిస్తుంది.
 
ఏమేం తినాలి? 
కనుపాపపై ఒత్తిడి తగ్గాలంటే తేలికపాటి వ్యాయామాలు అవసరం. అలా చేస్తే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కంటిపై ఒత్తిడి తీవ్రమైతే గ్లూకోమా సమస్య వస్తుంది. కాబట్టి వ్యాయామం తప్పనిసరి. కళ్లను పైకి, కిందకు కుడి, ఎడమలకు గుండ్రంగా తిప్పుతూ వ్యాయామం చేయడం వల్ల కళ్ల అలసట దూరం అవుతుంది. నీళ్లు ఎక్కువగా తాగకపోతే శరీరంలో తేమ తగ్గుతుంది. ఆ ప్రభావం కళ్ల మీద పడుతుంది. కళ్లు కాంతి హీనమవుతాయి. కళ్లు, కళ్ల చుట్టూ ఉన్న కండరాలకు చాలినంత విశ్రాంతి ఇవ్వటానికి కాసేపు కళ్లు మూసుకుని ఉంచాలి. తర్వాత కళ్లు తెరిచి దూరంగా చూడాలి. ఇలా రోజూ నాలుగైదు సార్లు చేయాలి. కంటి ఆరోగ్యం పెంచుకునేందుకు సంతులిత ఆహారం తీసుకోవాలి. పాలకూర, క్యాలీఫ్లవర్‌, క్యారెట్లు, బొప్పాయి, మామిడి, క్యాబేజీ, బీన్స్‌, దోసకాయ, మీగడ, పాలు తీసుకోవాలి.!