కంటికీ కావాలి కాస్త విశ్రాంతి!

‘సర్వేంద్రియానామ్‌ నయనం ప్రధానం’... అందమైన ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేవి కళ్ళే. మ‌న శ‌రీరంలోని అన్ని అవ‌యవాల్లో కళ్ళు చాలా ముఖ్య‌మైన‌వి. కళ్ళు లేక‌పోతే మ‌నం ఈ ప్ర‌పంచంలో దేన్నీ చూడ‌లేము. ఈ కాలంలో చాలామందికి ప‌లు కార‌ణాలవ‌ల్ల నిర్ణీత వయసు కంటే ముందుగానే కంటి చూపు స‌మ‌స్య వ‌స్తోంది. దీంతోపాటు ఇత‌ర నేత్ర స‌మస్య‌ల‌తోనూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు కింద సూచించిన చిట్కాలు పాటిస్తే కంటి చూపును మెరుగుపరుచుకోవ‌డ‌మే కాదు, కంటి స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గించుకోవ‌చ్చు.

అవసరం మేరకే వాడకం!

కళ్ళకు ఇబ్బంది కలిగించే ఏ పరిజ్ఞానమైనా అవసరమైనంత వరకు మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న అత్యాధునిక స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్లు, ఎల్‌ఈడీ టీవీలాంటివి ఎక్కువ సేపు చూస్తే కళ్ళకు ఇబ్బందే. నేడు అనేక మంది వీటికి అలవాటై ఎక్కువ సమయం  వీటిపైనే వెచ్చించి కళ్ళకు ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. దీంతో పలురకాల దృష్టిలోపాలు వస్తున్నాయి. చివరకు వైద్యుని సలహాలతో కళ్ళద్దాలు వాడాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి పదిమందిలో నలుగురు అద్దాలు వాడుతున్నారు. గతంలో జన్యుపరమైన లోపాలతో కళ్ళద్దాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం స్వయంకృతాపరాధమేనని వైద్యులంటున్నారు.

ఏసీలో పనిచేసేవారికే ఎక్కువ!

గాడ్జెట్లు వాడేవారిలో కళ్ళార్పడం తగ్గిపోవడంతో నల్లగుడ్డుపైన ఉన్న పొర పొడిగా మారుతుంది. దీంతో కళ్ళు మండుతున్నట్లు, తెలియని అలసట ఉన్నట్లనిపిస్తుంది. ఎక్కువగా ఏసీలో కూర్చుని పనిచేసే వారిలో ఈ సమస్య కన్పిస్తుంది. ఈ యంత్రాలు ద్వారా గదిలోని తేమతో పాటు కంటిలోని తేమను లాగేస్తున్నాయి. తద్వారా కంటిలో తేమ మాయమవుతుంది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ ఈ సమస్య ఉంటే కృత్రిమ చుక్కల ద్వారా ఉపశమనం పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీకి ఎదురుగా ఎప్పుడూ కూర్చోవద్దని సూచిస్తున్నారు.

కళ్ళకూ వ్యాయామం!

ఇంట్లో ఉన్నపుడు బుల్లితెర, ఆఫీసులో కంప్యూటర్, ప్రయాణంలో సెల్‌ఫోన్‌.. కళ్ళు నిరంతరం చూస్తూనే ఉంటాయి. దీంతో కళ్ళకు విశ్రాంతి లేకుండా పోతోంది. కళ్ళు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తుండటం వల్ల కంటిలో ఉన్న సూక్ష్మపొరలు దెబ్బతింటాయి. ఇదే పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగిన పక్షంలో కంటిలోని తేమ పూర్తిగా ఇంకిపోయే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. సాధారణగా ఒత్తిడి తాలూకూ ప్రభావం కంటి వెలుపలా ఉంటుంది. కళ్ళు ఎక్కువ అలసిపోతే కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని, ముఖం అందాన్ని దెబ్బతీస్తాయి. అందువల్ల కళ్ళకు కాస్త విశ్రాంతినిచ్చే సున్నితమైన ఎక్సర్‌సైజ్‌లు తప్పక చేయాలని వైద్యులు అంటున్నారు. 

కంప్యూటర్‌ లో వెలుగు తగ్గించాలి. 

ప్రస్తుత కాలంలో ఉద్యోగం అంటే.. కంప్యూటర్ ముందు కూర్చోవల్సిందే. కంప్యూటర్ సగటు జీవివృత్తిలో కంప్యూటర్ ఓ భాగమై పోయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా దీన్ని ఉపయోగిస్తున్నారు. చిటికెలో పనులు పూర్తి కావాలంటే కంప్యూటర్‌ను చూడక తప్పడం లేదు. కానీ, దీనివల్ల కళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందు గడపవలసి వచ్చినపుడు వివిధ రకాల వస్తువులవైపు వివిధ కోణాలలో తరచు చూడడం కంటి ఆరోగ్యానికి మంచిది. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి దూరంగా ఉన్న వస్తువులను 20 సెకన్ల పాటు చూడడం కండ్లకు చక్కని వ్యాయామం.
 అధిక పని లేదా ఎక్కువ ఒత్తిడిలో ఉన్నపుడు కాసేపైనా విశ్రాంతి తీసుకోవాలి. ఈ విశ్రాంతి వల్ల కళ్ళపైన పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కళ్ళకు విశ్రాంతి కోసం కంప్యూటర్‌ తెరపై ఉన్న కాంతిని తగ్గించుకుంటే మంచిది. కానీ  కాంతిని మరీ పూర్తిగా తగ్గించడం కూడా ప్రమాదమేనని ఐ కేర్‌ నిపుణులు అంటున్నారు.
కొన్ని చిట్కాలు..
* కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేవారు కనీసం వారానికి ఒకసారైనా వాటికి దూరంగా ఉండాలి.
* కళ్ళు మూసుకుని కనుగుడ్లను వలయాకారంగా తిప్పాలి. ఇది కూడా నెమ్మెదిగానే కొనసాగించాలి.
* పడుకునే ముందు కళ్ళకు వేసిన మేకప్‌ తీసేయాలి.
* అలసిన కళ్ళకు ఉపశమనం లభించాలంటే ఇంటికి రాగానే ఐస్ క్యూబ్స్‌ చేతిలో పట్టుకుని ఆ చల్లటి చేతులను కళ్ళకు ఆనించాలి. ఇలా రెండు మూడు నిమిషాలు చేసిన తర్వాత మునివేళ్ళతో కంటి పైభాగాన్ని సున్నితంగా మర్ధన చేయాలి.
* కళ్ళు చురుకుగా పని చేయాలంటే సమతౌల్యాహారం చాలా ముఖ్యం. ఆహారంలో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి.
* కళ్ళు బాగా అలసిపోయినప్పుడు టమోటోను చక్రాలుగా కోసి కంటిమీద 3-5 నిమిషాలు ఉంచాలి.