అందాన్నిచ్చే ఐలాషెస్‌తో కంటికి చేటు

కళ్లు పెద్దగా, అందంగా కనిపించేందుకు ఫేక్‌ ఐలాషెస్‌ వాడతారు చాలామంది. ఇవి పెట్టుకోవడం వల్ల అదనంగా అందం వచ్చి చేరడం సంగతేమో గాని కంటికి కలిగే నష్టమే ఎక్కువ అంటున్నారు శాస్త్రవేత్తలు. ‘‘కంటి బయట అతికించుకునే ఐలాషెస్‌ వల్ల నష్టం ఏముంటుందనే సందేహం కలుగుతుందా. అదెలాగంటే... కనురెప్పల వెంట్రుకలు పొడవుగా ఉండడం వల్ల ఎక్కువగా గాలి, దుమ్ము కంటిలోకి చేరి కళ్లు పొడిబారిపోతాయి. మనుషుల నుంచి జిరాఫీల వరకు మొత్తం 22 క్షీరద జాతుల మీద పరిశోధన చేసిన పిమ్మట ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాం. కళ్లలో దుమ్ము పడకుండా ఉండేందుకు, కార్నియా మీద తేమ ఆవిరైపోకుండా కాపాడేందుకు కనురెప్పల మీద ఉన్న వెంట్రుకలే రక్షణగా నిలుస్తాయి. ఈ వెంట్రుకలు కంటి వెడల్పులో 1/3 వంతు ఉంటాయి.
 
ఇంతకంటే పొడవుగా ఉన్నా, తక్కువ పొడవు ఉన్నా కంటి చుట్టూ గాలి ప్రసారం ఎక్కువగా జరుగుతుంది. దుమ్ము కణాలు కంట్లో పడతాయి. అలాగే కనురెప్పల వెంట్రుకలు ఉండాల్సినదానికంటే ఎక్కువ పొడవు ఉంటే కనురెప్పల వెంట్రుకలు సిలిండర్‌లా మారిపోయి గాలి, దుమ్ము కణాలు కళ్లలోకి నేరుగా వెళ్తాయి. దానివల్ల కంటిలో తేమ త్వరగా ఆవిరైపోతుంది. అందుకనే పొడవుగా అందంగా కనిపించే కనురెప్పల వెంట్రుకలు కంటి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చూసేందుకు అందంగా కనిపించే వీటివల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒకవేళ కనురెప్పల వెంట్రుకలు ఉండాల్సినంత పొడవు లేకపోతే అప్పుడు ఫేక్‌ ఐలా్‌షలు వాడొచ్చు. అయితే అవికూడా సాధారణంగా ఉండాల్సినంత పొడవే ఉండాలి. మీరేం చెప్పినా పొడవైన ఫేక్‌ ఐలాష్‌లు వాడకతప్పదు అనేవాళ్లు కాస్త మందంగా ఉన్న లాషెస్‌ వాడాలి. ఐలా్‌షలు మందంగా ఉండడం వల్ల కాస్తయినా కంటికి రక్షణగా నిలుస్తాయి అవి’’ అంటున్నారు శాస్త్రవేత్తలు.!