కళ్లను కాపాడుకుందామిలా!

24-06-2019: కళ్లను అశ్రద్ధ చేయడం వల్ల ఎర్రబారడం, గ్లూకోమా వంటి కంటి సంబంధ సమస్యలు వస్తాయి. 65 ఏళ్లు దాటిన వారిలో దాదాపు ఇరవై లక్షల యాభైవేల మందికి పైగా శుక్లాల (కేటరాక్ట్‌) సమస్యతో బాధపడుతున్నారు. కంటి పరమైన అనారోగ్యాలకు అధికబరువు, మధుమేహం కూడా ఒక కారణం. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కళ్లను కాపాడుకోవచ్చు.
 
కళ్లు పొడిబారడం: అరవై అయిదేళ్ల వయసు దాటిన వారిలో కళ్లు పొడిబారడం అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య. తగినన్ని కన్నీళ్లు స్రవించనప్పుడు ఈ సమస్య వస్తుంది. ఇది చూడ్డానికి చిన్న సమస్యలా తోచినప్పటికీ, కళ్లు దురదపెడతాయి, చిరాగ్గా అనిపిస్తాయి. దాంతో కళ్లు మసకమసకగా కనిపిస్తాయి. వాతావరణం చల్లగా ఉన్న రోజున కొన్ని నిమిషాలు కిటికీలు తెరిచి ఉంచితే చల్లని గాలి లభిస్తుంది. దాంతో కళ్లు పొడిబారడం తగ్గిపోతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా కొంతవరకూ తగ్గుతుంది. అయితే కళ్లకు చల్లని గాలి, తేమ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.
 
ఆహారం: భోజనం ద్వారా లభించే విటమిన్‌ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి వెలుపలి పొర, కార్నియాను ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షణనిస్తుంది. బచ్చలి, కాలే వంటి ఆకుకూరల్లో, ఎర్ర మిరియాలు, రెడ్‌ క్యాప్సికమ్‌, పండు మిర్చి పొడిలో విటమిన్‌ ఇ సమృద్ధిగా లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే శుక్లాలు, వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యలు తగ్గిపోతాయి.
 
అధిక బరువుతో అనర్థం: ఆరోగ్యకరమైన డైట్‌ కంటి చూపును మెరుగుపరుస్తుంది. స్థూలకాయం వచ్చే ముప్పును నివారిస్తుంది. ఫలితంగా మధుమేహం ముప్పు కూడా తగ్గుతుంది. మధుమేహం వల్ల వచ్చే డయాబెటిక్‌ రెటినోపతి వల్ల కంటి వెనక భాగంలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. దాంతో కంటిచూపు మందగిస్తుంది. కాబట్టి డైట్‌ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.
 
నో ట్యానర్స్‌: సన్‌బాత్‌, సన్‌బెడ్స్‌ ఉపయోగించడం వల్ల చర్మ కేన్సర్‌తో పాటు పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. అతినీలలోహిత కిరణాలు చర్మం మీద కన్నా కంటి చూపుమీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. దీర్ఘకాలికంగా శుక్లాలు, కనుపాప మీద కణితులు పెరిగే ప్రమాదముంది. అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి బయటపడేందుకు స్ర్పే టాన్‌ను ఉపయోగించాలి. సన్‌బెడ్‌ లేదా ఎండలో ఎక్కువ సమయం ఉన్నప్పుడు కళ్లను రక్షించుకునేందుకు నల్లకళ్లద్దాలు ధరించాలి.
 
20-20-20 విజన్‌: అదేపనిగా కంప్యూటర్‌, ట్యాబ్లెట్‌ వంక చూడడం వల్ల కళ్లు అలసిపోతాయి, ఫలితంగా కళ్లు పొడిబారుతాయి. ఈ సమస్యకు 20-20-20 నియమాన్ని పాటించాలి. ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కళ్లకు విశ్రాంతినివ్వాలి. 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకన్ల పాటు అలానే చూస్తూఉండాలి. దీంతో కంటి కండరాలకు విరామం లభిస్తుంది. కళ్ల మీద ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.