మెరుగైన కంటి చూపు కోసం...

03-06-2019: శరీరం చలాకీగా ఉండడానికి వ్యాయామం ఎంత అవసరమో, కంటి చూపు మెరుగ్గా ఉండడానికీ కళ్లకు వ్యాయామం అంతే అవసరం. ఇంతకీ ఆ వ్యాయామాలు ఏమిటంటే...
 
కళ్లు ఆర్పడం: ఏకాగ్రతతో పని చేసే సమయంలో కళ్లు ఆర్పడం మర్చిపోతూ ఉంటాం. దీని వల్ల కళ్లు పొడిబారి మంటలు మొదలవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కంప్యూటర్‌ ముందు కూర్చుని పని చేసే సమయంలో, ఎక్కువ సమయంపాటు టీవీ చూసే సమయంలో, తరచుగా కళ్లు ఆర్పడం మీద కూడా దృష్టి పెడుతూ ఉండాలి. ఇలా చేస్తే కళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. తొందరగా అలసటకు కూడా గురి కాకుండా ఉంటాయి.
 
ఫోకస్‌: బొటనవేలును ముఖానికి రెండు అంగుళాల దూరంలో ఉంచి, ఆ వేలి మీద దృష్టి కేంద్రీకరించాలి. తరువాత ఆ వేలును వీలైనంత దూరం తీసుకువెళ్లాలి. ఇలా చేస్తున్నప్పుడు దృష్టి మరల్చకూడదు. అలాగే దగ్గరలో ఉన్న ఓ వస్తువు మీదకు దృష్టి సారించి, వెంటనే దూరంగా ఉన్న మరో వస్తువు మీదకు దృష్టి మళ్లించాలి. ఇలా మార్చి మార్చి చేయాలి.
 
కంటికి యోగా: కళ్ల చుట్టూ ఉండే కండరాలకు వ్యాయామాన్ని అందించడం ద్వారా కళ్లను ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఇందుకోసం కళ్లను వీలైనంత పైకి తిప్పి, తిరిగి చుబుకం వైపుకు కిందకు తిప్పాలి. అలాగే కుడి, ఎడమలకూ తిప్పాలి. ఆ తర్వాత కనుగుడ్లను ఎనిమిది అంకె ఆకారంలో తిప్పాలి.
 
విశ్రాంతి: అలసిన కళ్లకు విశ్రాంతిని ఇవ్వడం కోసం రెండు అరచేతులతో కళ్లను మూసేయాలి. ఇలాచేస్తే ఆ కొద్దిసేపటి వరకూ కళ్లలోకి వెలుగు చొరబడకుండా ఉండి, కళ్లు సాంత్వన పొందుతాయి.