కళ్లు కాంతివంతంగా ఉండాలంటే

ఆంధ్రజ్యోతి, 20-10-2015: శరీరంలో కళ్లకున్న ప్రాధాన్యతే వేరు. అందుకే మన పెద్దలు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే కొన్నింటిని తప్పనిసరిగా తినాలి. అవి! 
  • ట్యూనాలాంటి ఫ్యాటీ ఫిష్‌ని తప్పనిసరిగా తినాలి. వీటిల్లో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. ఫిష్‌ను తినడం వల్ల వయసుతో వచ్చే కంటిజబ్బులను సులభంగా నియంత్రించవచ్చు. రెటీనాకు కూడా చాలా మంచిది. 
  • సిట్రస్‌ ఫ్రూట్స్‌ కూడా బాగా తినాలి. ఇవి సంవత్సరం పొడుగుతా లభిస్తాయి. వీటిల్లో విటమిన్‌-సి బాగా ఉంటుంది. సిట్రస్‌ ఫ్రూట్స్‌లో యాంటాక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల కళ్లలోని కార్నియా దెబ్బతినదు. కాటరాక్టు బారిన పడం కూడా. 
  • కేరట్లలో బేటాకెరొటెనా పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌-ఎ గురించి చెప్పనవసరం లేదు. ఎంతో ఆరోగ్యవంతమైన కేరట్‌ రెటీనాను సైతం కాపాడుతుంది. ముఖ్యంగా కాటరాక్టు పాలబడనీయకుండా నియంత్రిస్తుంది. ఉడకబెట్టిన కేరట్లు వారంలో ఎన్నిసార్లు తింటే కళ్లకు అంత మంచిది. 
  • బ్లూబెర్రీస్‌ రాత్రిపూట కంటిచూపు శక్తివంతంగా ఉండేట్టు చే స్తాయి. వీటిల్లో యాంథోసియానిన్స్‌, విటమిన్‌-సిలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగుపరచడమే కాకుండా కళ్ల అలసటను సైతం పోగొడతాయి. 
  • పాలకూరలో విటమిన్స్‌, బేటాకెరొటెనా బాగా ఉంటాయి. అందుకే పాలకూర కంటికి చాలా మంచిది. కళ్లపై అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా పాలకూర కాపాడుతుంది. కంటిచూపును మరింత శక్తివంతం చేస్తుంది. పాలకూరతో సలాడ్స్‌ చేసుకుని తినొచ్చు. పప్పు, కూర ఏదైనా వండుకోవచ్చు. దీన్ని రోజూ తింటే కళ్లకు చాలా ఆరోగ్యం. 
  • గుడ్లల్లో విటమిన్‌-ఎతో బాటు బోలెడన్ని యాంటాక్సిడెంట్లు ఉన్నాయి. కంటిచూపును సంరక్షించడంలో గుడ్లు ఎంతో బాగా పనిచేస్తాయి. వయసుతోపాటు వచ్చే రెటీనా సంబంధిత మాక్యులర్‌ డీజనరేషన్‌ జబ్బు పాలబడకుండా కాపాతాయి. 
  • బ్రొకోలిలో యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి. విటమిన్‌-సి అత్యున్నత పరిమాణంలో ఉంటుంది. బ్రొకోలి రెటీనాకు ఎంతో మంచిది. ఇది కూడా కళ్లను అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. 
  • మొక్కజొన్నలో ల్యుటిన్‌, జెక్సాన్‌థిన్‌లు ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. రెటీనాకు సంబంధించిన మాక్యులర్‌ డీజనరేషన్‌ జబ్బు పాలబడకుండా నిరోధిస్తాయి. మొక్కజొన్నతో సలాడ్స్‌ చేసుకుని తినొచ్చు. వంటకాలు వండుకోవచ్చు. లేదా మొక్కజొన్నను కాల్చి తినొచ్చు. రోజుకు 5 నుంచి 6 గ్రాముల మొక్కజొన్న తింటే కళ్లకు కాటరాక్టు సోకకుండా ఉంటుంది.