కళ్లు పొడిబారిపోతున్నాయా?

అన్ని అవయవాల్లో కెల్లా నయనాలే ప్రధానం అనే మాట అనాదిగా వింటున్నదే. అలా అని అత్యధిక భారాన్ని కళ్లమీదే పెడితే ఎలా? కానీ ఇప్పుడదే జరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం శారీరక శ్రమను గణనీయంగా తగ్గించిన ఈ నేపథ్యంలో ఇతర ఏ అవయవం మీదా పడనంత భారం కళ్ల మీద పడుతోంది.
 
శారీరక శ్రమ బాగా తగ్గిపోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తితే, కళ్ల మీద భారం పడటం వల్ల కూడా కొన్ని సమస్యలు మొదలవుతున్నాయి. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న కంటి సమస్య డి .ఇ.ఎస్‌ (డ్రై ఐ సిండ్రోమ్‌. కళ్లల్లో అసౌకర్యంగా ఉండడమే కాదు, కొంత మేర దృష్టి సంబంధితమైన సమస్యలకు కూడా ఇది కారణమవుతుంది. ఇందులో ప్రధానంగా కనిపించే సమస్య కళ్లల్లోని తేమ తగ్గిపోయి క్రమక్రమంగా పొడిబారిపోవడం. క ళ్లు తడారిపోతే క ళ్లల్లో మంటగా ఉండడమే కాదు చదవడం, కంప్యూటర్‌ మీద పనిచేయడం, రాత్రివేళ డ్రైవ్‌ చేయడం ఇవ న్నీ కష్టమవుతాయి. కృత్రిమంగా కళ్లల్లోకి నీళ్లు తెప్పించే కొన్ని విధానాలైతే ఉన్నాయి గానీ వీటి వల్ల కలిగే ఉపశమనం తాత్కాలికమే. ఇటీవలి కాలంలో జరిగిన ఒక అధ్యయనంలో చేపల్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి అందే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్‌ వల్ల డి.ఇ.ఎస్‌ సమస్య రాకుండా చూసుకోవచ్చని తేలింది. ‘అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌’ అనే పత్రికల్లో ఈ విషయాలు ప్రచురితమయ్యాయి. ఒమేగా-3 యాసిడ్స్‌కు సహజంగానే శరీరం మొత్తంలో ఎక్కడ వాపు వచ్చినా తగ్గించే గుణం ఉంది. అందులో భాగంగానే కంటిలోని వాపును తగ్గించడం ద్వారా కళ్లు పొడిబారిపోవడాన్ని సమర్థవంతంగా నిరోధిస్తుంది. మానవ ప్రయత్నంగా ఏవేవో మందులు తయారు చేసే అవసరం లేకుండా , ప్రకృతి సిద్ధమైన వాటినుంచే శరీరానికి అవసరమైన అన్ని ఔషధాలు లభిస్తే అంతకన్కా ఏం కావాలి?