కంటిలోన కాలుష్యం

ఆంధ్రజ్యోతి, 13-10-2015: కంటిలోన కాసింత నలుసు పడితేనే ఆ బాధ భరించలేం. పట్టణ ప్రాంతాల్లో పేరుకుపోతున్న వాయుకాలుష్యం కళ్లపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. గాలిలోని దుమ్ము, ధూళి కళ్ల ఇన్‌ఫెక్షన్లకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో ఈ సమస్య అధికంగా ఉందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ కాలుష్యం దెబ్బకు కంటి రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు. గతేడాది ఢిల్లీలో 30 వేల మంది కంటి వ్యాధుల బారినపడ్డారు. గాలిలో నైట్రిక్‌ ఆక్సైడ్‌, నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ పాళ్లు గణనీయంగా పెరగడం కళ్లకు హానికరంగా మారుతోంది. గాలిలో ఆమ్లత్వం ఎక్కువ కావడంతో కళ్లకు సంబంధించిన అలర్జీలు, కార్నియా ఇన్‌ఫెక్షన్లు కలుగుతాయి. అయితే కళ్లు మంటగా ఉన్నప్పుడు అదేపనిగా రుద్దడం మంచిది కాదంటున్నారు వైద్యులు. ప్రయాణవేళలో కళ్లు కాస్త మండితే ఇంటికి వెళ్లాక చల్లటి నీటితో శుభ్రం చేసుకుని.. మెత్తటి వస్త్రంతో తుడుచుకోవాలి. విటమిన్‌-ఎ అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. కనీసం ఆరుమాసాలకు ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలి.