ఇలా చేస్తే కళ్లు అలసిపోవు

11-05-2018: వేసవిలో కళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కాలంలో కళ్లు తొందరగా అలసిపోతాయి. అంతేకాదు కంటికి సంబంధించి రకరకాల సమస్యలు చుట్టుముడతాయి. అందుకే కళ్లకు కొన్ని చిట్కాలు...

 
కళ్లు తాజాగా ఉండాలంటే ఎగ్‌ మాస్కు, చల్లటి నీరు కలపి కళ్లకు రాసుకోవాలి.
కళ్లు మిల మిల మెరవాలంటే క్యారెట్‌, పాలకూరలాంటివి బాగా తినాలి.
వీలైనంతవరకూ వేసవిలో మేకప్‌, ఫౌండేషన్లు వేసుకోకుండా ఉండాలి.
కళ్లు మెరవాలంటే గ్రీన్‌ టీ బ్యాగ్స్‌ను కళ్ల మీద పెట్టుకోవాలి. ఇలా చేస్తే కళ్లల్లో మంట తగ్గడమే కాదు విశాలంగా తయారవుతాయి.
కంటినిండా నిద్ర పోవాలి. ఒత్తిడి పడకూడదు. సహజంగా ఈ రెండు కారణాల వల్ల్లే కళ్లు తొందరగా అలసిపోతాయి.
రెండు టీస్పూన్లను తీసుకుని ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచి ఉదయాన్నే వాటిని కనురెప్పల మీద పెట్టుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్లను తీస్తుండాలి. ఇలా చేయడం వల్ల కూడా కళ్లు తేటగా, తాజాగా కనపడతాయి. చల్లటి స్పూన్లు కళ్ల మీద పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.
కాటన్‌ ప్యాడ్స్‌ను చల్లటి నీళ్లల్లో ముంచి పదినిమిషాలు కనురెప్పల మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ్ల కళ్లు బరువెక్కినట్టు అనిపించవు. కాటన్‌ ప్యాడ్స్‌ సరైన పాళ్లల్లో మాత్రమే చల్లదానాన్ని కళ్లకు అందివ్వాలి. అప్పుడే కళ్లు తాజాగా ఉంటాయి.
ఎగ్‌ మాస్కు రాసుకుంటే కళ్లు అందంగా కనిపిస్తాయి. రెండు మూడు ఎగ్స్‌ తీసుకుని అందులోని తెల్లసొనను బాగా గిలక్కొట్టి కంటిచుట్టూ రాసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కళ్లు కడుక్కోవాలి. ఎగ్‌ మాస్కు వల్ల కళ్ల కింద చర్మం బిగుతుగా తయారవుతుంది కూడా.
రెండు కీరదోస కాయలు తీసుకుని వాటిల్లోంచి రసాన్ని తీయాలి. కళ్ల కింద నల్లటి వలయాల మీద కాటన్‌ ప్యాడ్స్‌తో ఈ రసాన్ని అప్లై చేసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా ఐదు రోజులు చేస్తే కళ్లు అందంగా తయారవుతాయి.
టొమాటో గుజ్జులో చిటికెడు పసుపు, అర టీస్పూను నిమ్మరసం, ఒక టీస్పూను శెనగపిండి వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును కనురెప్పలపై, కళ్లకింద నల్ల వలయాలు ఉన్నచోట రాసి అరగంటసేపు అలాగే ఉంచాలి. తర్వాత తడిపిన కాటన్‌ ప్యాడ్స్‌తో కంటి చుట్టూరా సున్నితంగా తుడవాలి. ఇలా రోజుకు ఒకసారి వారం రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కనురెప్పలు ఉబ్బినట్టు ఉంటే పచ్చి బంగాళాదుంప ముక్కను కనురెప్పల మీద 20 నిమిషాలు ఉంచుకోవాలి. దాంతో కళ్లు తేటగా అవుతాయి. లేదంటే చల్లటి నీళ్లల్లో విటమిన్‌-ఇ ఆయిల్‌ చుక్కలు కొన్ని వేసి అందులో కాటన్‌ పాడ్స్‌ను ఐదునిమిషాలు నాననిచ్చి, తర్వాత వాటిని కళ్ల మీద 20 నిమిషాలు పెట్టుకోవాలి.