కంటికి షుగర్ పొర

ఆంధ్రజ్యోతి (19-11-2019): గట్టు తెగిన చెరువు ఊరిని ముంచేసినట్టు, అదుపుతప్పిన మధుమేహం ఒంటిని కబళిస్తుంది! వేర్వేరు అంతర్గత అవయవాలతో పాటు, కళ్ల మీద కూడా ప్రభావం చూపిస్తుంది! డయాబెటిక్‌ రెటీనోపతీ ఎదురుకాకూడదంటే... మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునేలా జాగ్రత్తలు పాటించాలి!
 
చక్కెర ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికీ కళ్లు దెబ్బతింటాయని అనుకోకూడదు. మధుమేహం ప్రభావంతో కంటిచూపు దెబ్బతినే డయాబెటిక్‌ రెటీనోపతీ సమస్య రెండు సందర్భాల్లోనే ఎదురయ్యే వీలుంది. పదేళ్లకు పైగా మధుమేహం సమస్య ఉన్నవారు లేదా, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోనివాళ్లు... ఈ రెండు వర్గాలకు చెందినవారికి డయాబెటిక్‌ రెటినోపతీ, ఇతరత్రా కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని సమస్యల్లో లక్షణాలు ఒక కంట్లో లేదా రెండు కళ్లలో కనిపించవచ్చు. కొన్ని సమస్యల్లో చివరి దశ వరకూ కనిపించకపోవచ్చు. రెటీనా అనేది కంటి వెనక ఉండే నాడి పొర. మనం చూసే ప్రతి దృశ్యం దాని మీదే పరావర్తనం చెందుతుంది. అక్కడి నుంచి ఆప్టిక్‌ నర్వ్‌ ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేయడం ద్వారా మనం ఎదురుగా కనిపించే దృశ్యాన్ని స్పష్టంగా చూడగలం. అయితే మధుమేహంతో నాడి పొరకు సరిపడా ఆక్సిజన్‌ అందనప్పుడు పలు రకాల సమస్యలు తలెత్తుతాయి.
 
కంట్లో రక్తం... ‘డయాబెటిక్‌ రెటీనోపతీ!’
ఆక్సిజన్‌ సరిపడా అందనప్పుడు కంట్లో అసహజ రక్తనాళాలు ఏర్పడి, చిట్లుతూ ఉంటాయి. దాంతో చూపు మందగిస్తుంది. ఈ నష్టమంతా హఠాత్తుగా కాకుండా నెమ్మదిగా జరుగుతుంది. చూపు సాధారణంగా ఉన్నంత కాలం కళ్లు బాగానే ఉన్నాయి అనుకుంటాం. కానీ లోపల్లోపల జరగరాని నష్టం జరుగుతూ, హఠాత్తుగా కంటిచూపు తగ్గుతుంది. ఈ నష్టం మూడు దశల్లో జరుగుతుంది. మూడో దశలో మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. అయితే క్రమం తప్పక ఏడాదికోసారి కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉంటే, ఈ సమస్య తలెత్తినా మొదటి దశలోనే కనిపెట్టవచ్చు. ఇలా మొదటి దశలో కనిపించిన హైపాక్సియాను లేజర్‌ చికిత్సతో తిరిగి సరిదిద్దుకోవచ్చు. చిట్లిన రక్తనాళాలను లేజర్‌ సహాయంతో కాల్చివేసి, రక్తస్రావాన్ని ఆపి, చూపు దెబ్బతినకుండా చూడవచ్చు. కొందరిలో రక్తనాళాలు చిట్లుతూ, నయమవుతూ కంట్లో ఒక బ్యాండ్‌లాగా తయారవుతాయి. ఆ బ్యాండ్‌ రెటీనాను లాగేయడంతో రెటీనా ఊడిపోతుంది. ఈ దశలో చికిత్స చేసినా కంటిచూపు తిరిగి రాదు. ఇలా చివరి దశకు చేరుకుంటే చికిత్స చేసినా పరిస్థితి చక్కబడదు.
 
కంట్లో వాపు... ‘డయాబెటిక్‌ మాక్యులర్‌ ఎడీమా!’
రెటీనా మధ్యలో ఉండే మాక్యులాలో వాపు తలెత్తుతుంది. కంటి చూపు చురుగ్గా ఉండాలంటే ఈ భాగం ఆరోగ్యంగా ఉండడం అవసరం. టీ.వీ చూడాలన్నా, పుస్తకం చదవాలన్నా మాక్యులా ఆరోగ్యంగా ఉండాలి. ఈ భాగంలో వాపు, నీరు చేరినా ప్రారంభ దశలోనే కంటి చూపు తగ్గుతుంది. వెంటనే వైద్యులను కలిస్తే వాపు తీవ్రతను బట్టి ఇంజెక్షన్లు ఇస్తారు. మొదటి దశలో ఇంజెక్షన్లు లేదా కేవలం కంటి చుక్కలతో కూడా పరిస్థితిని చక్కదిద్దవచ్చు. కొన్నిసార్లు ఎక్కువ ఇంజెక్షన్లు అవసరం రావచ్చు. ఇంజెక్షన్లతో వాపు అదుపులోకి వస్తుంది. నీరు తగ్గుతుంది. ఏది ఏమైనప్పటికీ వాపు వచ్చింది అంటే, దానర్థం కొంతమేరకు రెటీనా దెబ్బతిన్నట్టుగానే భావించాలి. ఈ వాపు ఏ దశలో ఉందనేది స్కానింగ్‌ ద్వారా కనిపెట్టి, పరిస్థితిని బట్టి ఇంజెక్షన్లు లేదా లేజర్‌ చికిత్సలతో సమస్యను చక్కదిద్దవచ్చు.
 
సిరల్లో అడ్డంకులు
కంట్లోని రెటీనా దగ్గర ఉండే సిరల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. ఇవి రెటీనాకు జరిగే రక్తప్రసారాన్ని అడ్డుకుంటాయి. దాంతో కంటిచూపు తగ్గుతుంది. ఇలాంటప్పుడు కూడా ఇంజెక్షన్లతో అవరోధాలను తొలగించవచ్చు. అయితే ధమనులు మూసుకుపోయినప్పుడు పరిస్థితిని సీరియ్‌సగానే భావించాలి.
 
కంట్లో శుక్లాలు!
చూపు మసకబారడంతో మొదలై, పరిస్థితి క్రమేపీ చేయి దాటుతూ ఉంటే శుక్లాలుగా భావించాలి. మధుమేహం లేని వారిలో కూడా శుక్లాలు తలెత్తే వీలు ఉన్నా, మధుమేహం ఉన్నవారిలో చిన్న వయసులో, త్వరితంగా తలెత్తుతాయి. శుక్లం తొలగించి, కృత్రిమ కటకాన్ని అమర్చే సర్జరీతో ఈ సమస్యను సరిదిద్దవచ్చు.
 
ఆప్టిక్‌ నర్వ్‌ పాడైతే... ‘ఆప్టిక్‌ న్యూరోపతీ’!
ఈ నరంలో వాపు వచ్చి, హఠాత్తుగా చూపు దెబ్బతింటుంది. దీనికి స్టెరాయిడ్‌ మాత్రలు ఇవ్వవచ్చు. కంట్లోని ఆప్టిక్‌ నరం ఒకసారి మధుమేహ ప్రభావానికి గురై పాడైతే, చికిత్సతో బాగుచేయడం కుదరదు. ప్రారంభంలో మసక మసకగా కనిపిస్తుంది. మొదట ఒక కంట్లోనే సమస్య మొదలవుతుంది. రెండో కన్ను చూపు మామూలుగానే ఉండడంతో, మొదటి కన్ను సమస్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా ఆలస్యం చేయడం మూలంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
 
చేతులు కాలకముందే...
అదుపుతప్పిన మధుమేహం కంటి చూపును దెబ్బతీయకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి!
మధుమేహాన్ని మందులతో అదుపులో ఉంచుకోవాలి.
ఆహారనియమాలు పాటిస్తూ, క్రమం తప్పక వ్యాయామం చేస్తూ ఉండాలి.
ఇంట్లో సొంతంగా మధుమేహ పరీక్షల కిట్‌లను ఉపయోగిస్తున్నా, అప్పుడప్పుడూ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌లో డయాబెటిక్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
వైద్యులను క్రమం తప్పక కలుస్తూ కళ్లు పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ఏడాదికోసారి కంటి పరీక్షలు తప్పనిసరి.
ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు అంతకన్నా ముందే, నాలుగు లేదా ఆరు నెలలకే మధుమేహ పరీక్షలు చేయించుకోమని సూచిస్తే, వారి సూచనలు తు.చ. తప్పకుండా పాటించాలి.
కళ్లజోడు షాపుల్లో కంటి పరీక్షలు చేయించుకోకుండా, కంటి వైద్యులనే ఆశ్రయించాలి.
కంటిచూపు తగ్గగానే, కళ్లజోడు మార్పించుకోవడం సరికాదు. రెటీనా సమస్యలు ఉన్నట్టు వైద్యులు కనిపెడితే, రెటీనా సంబంధిత వైద్యులను కలవాలి.
పిల్లల్లోనూ జువెనైల్‌ డయాబెటిస్‌ రావచ్చు. కాబట్టి పిల్లలను కూడా క్రమం తప్పక కంటి వైద్యుల దగ్గరకు తీసుకువెళ్తూ ఉండాలి.
 
ఈ లక్షణాలు గమనించాలి!
కళ్ల ముందు నల్ల చుక్కలు, దారాలు తేలుతున్నట్టు కనిపించడం
చూపు మసకబారడం.. రంగులు వన్నె తగ్గి కనిపించడం
కనిపించే దృశ్యంలో ఖాళీ లేదా నల్లని ప్రదేశాలు ఉండడం
కంటిచూపు తగ్గడం
 
- డాక్టర్‌ శ్రీలక్ష్మి నిమ్మగడ్డ
క్యాటరాక్ట్‌ అండ్‌ లాసిక్‌ సర్జన్‌, విన్‌ విజన్‌ ఐ హాస్పిటల్స్‌, బేగంపేట, హైదరాబాద్‌