కంటిపొరలకు చెక్

ఆంధ్రజ్యోతి, 07/07/2015: కంటిముందు భాగాన్ని కప్పి ఉంచే పల్చనిపొర పారదర్శకత కోల్పోవడం వల్ల కంటి చూపు తక్కువగా గాని, ఎక్కువగా గాని లేక పూర్తిగా కనబడకుండా పోతుంది. దీనినే శుక్లం, కేటరాక్ట్‌ అని అంటారు. సామాన్యంగా వృద్ధాప్యంలో వచ్చే శుక్లాన్ని వృద్ధాప్యపు కంటిపొర అంటారు. ఇది యాభై సంవత్సరాలు వయస్సు గల వారిలో వస్తుంది. మధుమేహ వ్యాధిలో వచ్చే దుష్ఫలితం కారణంగా కంటిపొరలు ఏర్పడతాయి. కొన్ని గాయాల వల్ల కూడా వస్తాయి. ముఖ్యంగా గాజు పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల్లో కళ్లు తీవ్రమైన వేడికి గురై ఇలాంటి కంటిపొరలు సహజంగా ఏర్పడుతుంటాయి. అంతేకాకుండా ఎక్స్‌రేలు, రేడియం, న్యూక్లియర్‌ ఎనర్జీల వల్ల కూడా ఈ కంటి శుక్లాలు ఏర్పడతాయి. కరెంట్‌ షాక్‌ తగిలినపుడు శరీరంలో విద్యుత్‌ ప్రవహించి కంటి పొరలు కలుగుతాయి. ఇలాంటి వాటిని ఎలక్ట్రిక్ కాటరాక్ట్స్‌ అంటారు.
 
ప్రత్యేకించి కంటి పొరలు ఏర్పడినపుడు కళ్ల ముందు చుక్కలు చుక్కలుగా తేలియాడుతున్నట్లు అనిపిస్తాయి. ఎక్కువ కాంతిలో ఉన్న వస్తువులు ఒకటి రెండుగా కనబడతాయి. ముఖ్యంగా రాత్రిళ్లు చీకటిలో దూరంగా ఎక్కువ కాంతిలో ఉన్న లైట్లు ఇలా ఒకటికి రెండుగా కనబడతాయి. దగ్గరగా ఉన్న వస్తువులు కొంతవరకూ బాగానే కనిపిస్తాయి. ఈ రకమైన దృష్టి లోపం కంటి అద్దాలతో కొంతకాలం సరిచేసుకోవచ్చు. ఈ రకంగా కాలం గడుస్తున్న కొద్దీ దృష్టి పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది.
 
ప్రాథమిక దశలో తీవ్రమైన కాంతిలో కంటే చీకటి పడుతున్న సంధ్యా సమయంలో కొంత ఫర్వాలేదు. ఎందుకంటే కనుగుడ్డులో ఉన్న మధ్యభాగం మాత్రమే పారదర్శకత కోల్పోవడం వల్ల చుట్టూ తేటగా ఉన్న భాగం నుండి కాంతి లోపలి కంటిలోకి చేరి వస్తువులు కనిపిస్తాయి.
 
ఆయుర్వేదరీత్యా వాత దోషం ప్రకోపించడం వల్ల ఈ కంటిపొరలు ఏర్పడతాయి. ఈ వాత దోషం కంటిని పొడిబారేట్టు చేసి పారదర్శకత లోపించేట్టు చేయడం వల్ల కంటిలో పొరలు ఏర్పడి దృష్టిలోపం కలుగుతుంది. ఈ లోపం సరిచేయడానికి వాత దోష ప్రకోపాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. దీనికి ప్రత్యేకించి కొన్ని మూలికలతో కలిపి వండి తయారు చేసిన (మహాత్రిఫలామృతం)ఆవు నెయ్యిని వాడటమే మంచి పరిష్కారంగా ఆయుర్వేదం చెబుతుంది. ఇది అన్ని ఆయుర్వేద మందుల షాపుల్లో సులభంగా దొరుకుతుంది. ప్రారంభదశలో ఈ మహా త్రిఫలమృతం మాత్రమే ఔషధంగా వాడదగింది. ఈ ఔషధ యుక్తమైన నెయ్యిని రెండు టీ స్పూన్లు రోజూ ఉదయం, రాత్రి భోజనం ముందు గోరువెచ్చని పాలల్లో కలిపి ఇవ్వాలి. రెండవది గ్లాసు నీటిలో త్రిఫలచూర్ణం కలిపి రాత్రి నానబెట్టి ఉదయాన్నే వడబోసి సగం తాగి మిగిలిన నీటితో కళ్లు కడగాలి. దీని వల్ల రోగికి కంటి చూపు మెరుగవుతుంది.
 
మరికొన్ని సులభ చికిత్సలు పరిశీలిద్దాం. 
  • యవల బియ్యాన్ని నీటిలో మెత్తగా నూరి కంటికి పెడితే అతిగా వ్యాపించిన కంటి శుక్లాలు త్వరగా తగ్గుతాయి. 
  • ఆవుపాలతో శుద్ధి చేసిన తెల్ల గలిజేరు వేరును ఆవునేతిలో మెత్తగా నూరి కంటికి పెడితే పొరలు కరుగుతాయి. 
  • రెడ్డివారి నానుబాలాకు తుంచితే వచ్చేపాలను ఉదయాన్నే కళ్లలో పెడుతుంటే శుక్లాలు తగ్గుతాయి. 
  • తానికాయలోని గింజను పాలల్లో అరగదీసి కంటికి పెడుతుంటే కంటి పొరలు తగ్గి దృష్టి బాగుపడుతుంది. 
  • ఆముదం గింజలోని పప్పును ఆవు నేతిలో అరగదీసి కంటికి పెడితే కంటిపొరలు తగ్గుతాయి. 
  • నేల ఉసిరిక రసాన్ని గుడ్డలో వడకట్టి రెండు చుక్కల చొప్పున రెండు కళ్లల్లో ఉదయాన్నే వేస్తుంటే కళ్ల జబ్బులేవీ రావు. 
  • ఇందుప గింజలను కలబంద గుజ్జులో పదిరోజులు నానబెట్టి నీడన ఎండించి ఒక గింజను నీళ్లతో అరగదీసి కంటికి కందిగింజంత పెడుతుంటే అవి కంటిపొరలను కోసి మంచి దృష్టినిస్తాయి. 
  • పొద్దు తిరుగుడు చెట్టు గింజల చూర్ణాన్ని మూడు వేళ్లకు పట్టినంత 21 రోజుల పాటు నీటితో వాడితే కంటి పొరలు తగ్గుతాయి. 
  • పొడపత్రి ఆకు 20 గ్రాములు, మిర్యాలు 10 గ్రాములు కలిపి మెత్తగా నూరి కణికెలు చేసి ఎండించి నీటిలో అరగదీసి కండ్లకు కాటుక పెడుతుంటే కంటి పొరలు త్వరగా తగ్గిపోతాయి. 
  • కంటి సమస్య ఉన్నప్పుడు ముందుగా ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించాకే.. వారి సలహా మేరకు అనుసరించండి. సొంత వైద్యం వద్దు. 


డాక్టర్‌ కందమూరి, ఆయుర్విజ్ఞాన కేంద్రం