కంటిని చూసి అల్జీమర్స్‌ గుర్తించొచ్చు

ఆంధ్రజ్యోతి(03-10-2016): జ్ఞాపకశక్తి పోతుంది.. ఎదుటి వారి మాటలు అర్థం కావు.. మనసులో రకరకాల భ్రమలు కలుగుతాయి.. చివరికి నడక కూడా కష్టం అయిపోతుంది! వృద్ధుల జీవితాలను కబళించే అల్జీమర్స్‌ వ్యాధి ముదిరితే కనిపించే లక్షణాలు ఇవి. అయితే, కంటిని స్కాన్‌ చేయడం ద్వారా ఈ వ్యాధిని తొలిదశలోనే గుర్తించవచ్చని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్‌లూ శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం రోగుల్లో అల్జీమర్స్‌, డిమెన్షియా(చిత్తభ్రాంతి) ముదిరిన తర్వాత ఆ లక్షణాలు కనిపిస్తే.. వైద్యులు పాజిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ(పీఈటీ) పద్ధతిలో మెదడును స్కాన్‌ చే సి, వ్యాధిని నిర్ధారిస్తున్నారు. పైగా ఇది ఖరీదైన విధానం. ఈ నేపథ్యంలో.. తాము సులభం, చవకైన కంటి స్కాన్‌ పద్ధతిని గుర్తించామని వర్సిటీ ప్రొఫెసర్‌ మెలనీ క్యాంప్‌బెల్‌ వెల్లడించారు. అల్జీమర్స్‌ రోగుల మెదడులో అమైలాయిడ్‌ బీటా ప్రొటీన్‌ నిల్వలు పెరుగుతాయని ఇదివరకే గుర్తించారని, కానీ కంటిలోని రెటీనాపై కూడా ఈ ప్రొటీన్లు పేరుకుపోతాయని తాము కనుగొన్నామన్నారు. రెటీనాపై ఈ ప్రొటీన్ల నిల్వలను బట్టి.. అల్జీమర్స్‌ రాకను ముందే గుర్తించి, చికిత్స చేయవచ్చని తెలిపారు.