నల్లటి వలయాలకు గుడ్‌బై

కళ్ల కింద నల్లని వలయాలుంటే ఎంతటి కాంతులీనే ముఖమైనా వెలవెలపోతుంది. కాబట్టి ఆ వలయాల కారణాలను తెలుసుకుని వాటి మూలాల్లోకి వెళ్లి సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేయాలి.
 
కళ్ల కింద నలుపుకు సాధారణ కారణాలు 
ఐరన్‌ లోపం: ఐరన్‌ లోపమైన అనీమియా వల్ల కళ్ల కింద నలుపు చేరుకుంటుంది. రక్తంలో ఐరన్‌ తగ్గితే ఆక్సిజన్‌ను చేరవేసే హిమోగ్లోబిన్‌ తేలికగా విరిగిపోతుంది. కళ్ల కింద చర్మం పలుచగా ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశం కమిలిపోయి నల్లగా తయారవుతుంది. కాబట్టి ఆహారంలో ఐరన్‌ తగినంత ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, నట్స్‌, విత్తనాలు తినాలి.
 
ఒత్తిడి: ఒత్తిడికి గురైనప్పుడు రక్తం శరీరంలోని ప్రధాన అవయవాల వైపుకు ప్రవహిస్తుంది. దాంతో రక్తం లోపించిన ముఖం, కళ్లు పాలిపోయినట్టు తయారవుతాయి. ఒత్తిడి వల్ల కళ్ల చుట్టూ ఉండే సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావమవుతుంది. దాంతో కళ్ల కింది పలుచని చర్మం అడుగున గూడుకట్టుకున్న రక్తం లేత వంకాయ రంగులో బయటికి కనిపిస్తుంది.
 
అలసట: నిద్రలేమి, అలసట వల్ల కళ్ల కింద నల్లగా తయారవుతుంది. 
కళ్లు నులుముకోవడం: ముఖం మొత్తంలో కళ్ల చుట్టూ ఉండే చర్మమే అతి పలుచనిది, సున్నితమైనది. ఈ ప్రదేశంలోని రక్తనాళాలు కూడా ఎంతో సున్నితంగా తేలికగా చిట్లిపోయే తత్వం కలిగి ఉంటాయి. కాబట్టి ఆ ప్రదేశం నల్లగా తయారవకుండా ఉండాలంటే చేతులతో రుద్దడం, నులుముకోవడం చేయకూడదు.

లావుపాటి కళ్లద్దాలు: 
ఇలాంటి కళ్లద్దాల వల్ల కళ్లు ఎక్కువ శ్రమకు గురవుతాయి. దాంతో కళ్ల చుట్టూ నల్లగా తయారవుతుంది. 
సన్‌ డ్యామేజ్‌: సూర్యరశ్మి ప్రభావం వల్ల కళ్ల చుట్టూ ఉండే రక్తనాళాలు తేలికగా చిట్లి రక్తస్రావమవుతుంది. కాబట్టి సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షణ పొందాలంటే తేలికగా ఉండే సన్‌ గ్లాసెస్‌ ధరించాలి. 
నలుపుకు సులువైన చికిత్సలు
 
బీ కాంప్లెక్స్‌: బి విటమిన్‌ కళ్ల చుట్టూ ఉండే సున్నితమైన రక్తనాళాలకు బలాన్నిచ్చి అవి తేలికగా చిట్లి రక్తస్రావమవకుండా కాపాడుతుంది. కాబట్టి రోజుకో బీ కాంప్లెక్స్‌ టాబ్లెట్‌ వేసుకోవాలి.
 
యాంటీఆక్సిడెంట్లు: యాంటీఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ చర్మాన్ని బలహీనపరిచి మరింత పలుచగా తాయరయ్యేలా చేస్తాయి. వాటి ప్రభావం వల్లే పలుచగా ఉండే కళ్ల దగ్గరి చర్మం మరింత పలుచబడి నల్లగా తయారవుతుంది. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్లను ప్రేరేపించే జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. 
ఈ మందులకు దూరంగా ఉండాలి: రక్త నాళాలను వ్యాకోచింపజేసి రక్త ప్రసారాన్ని పెంచే మందులకు దూరంగా ఉండాలి. మీరు వాడే మందుల్లో ఆ ప్రభావాన్ని కలిగి ఉన్న వాటిని వైద్యుల సహాయంతో గుర్తించే ప్రయత్నం చేసి ప్రత్యామ్నాయ మందులను ఎంచుకోవాలి.