బీట్‌రూట్‌ కంటికి బెటర్‌!

26-03-2019: కొంత వయసు పైబడ్డాక శరీరంలోని అవయవాలన్నీ ఒకొక్కక్కటిగా బలహీనపడుతూ వెళతాయి. అయినా ప్రారంభంలో సమస్య అంత పెద్దగా ఏమీ ఉండదు కాబట్టి, ఎక్కువ మంది ఆ విషయంలో నిర్లక్ష్యంగానే ఉండిపోతారు. ఫలితంగా వ్యాధి ముదిరిపోతుంది. కొన్ని వ్యాధులు కాస్త ముదిరినా తిరిగి చక్కదిద్దే అవకాశం ఉంటుంది కానీ, ఇంకొన్ని రకాల వ్యాధులు ముదిరిపోతే ఆ తర్వాత ఇంక చేయగలిగేది ఏమీ ఉండదు.
 
ఉదాహరణకు గ్లకోమా అనే కంటి జబ్బునే తీసుకుంటే, అది కాస్త ముదిరితే చాలు ఏం చేసినా పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ జబ్బును మందులూ నయం చేయలేవు. సర్జరీతో ఒరిగేదీ ఏమీ ఉండదు. అందువల్ల ఏదైనా ఒక వ్యాధి వచ్చి, అది ముదిరే దాకా చూసి నానా అవస్థలూ పడే కన్నా, అసలు ఆ జబ్బులు రాకుండానే చూసుకోవడం మేలు. నిజానికి, వ్యాధులు రాకుండా చేసుకోవడానికి, భారీగా ఖర్చుపెట్టాల్సిన అవసరమేమీ లేదు. రోజువారి ఆహార పదార్థాల్లో కాస్త జాగ్రత్త పడితే చాలు. ప్రత్యేకించి కంటి జబ్బులనే తీసుకుంటే, రోజూ ఆకుకూరలూ, బీట్‌రూట్‌ వంటి వాటిని రోజు వారీ అహారంలో చేరిస్తే దృష్టిలోపం కలిగించే, మాక్యులర్‌ డీజనరేషన్‌ అనే వ్యాధిరాకుండా జాగ్రత్తపడవచ్చు. కంటి ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన పోషకం నత్రజని. 100 గ్రాముల పాలకూరలో 20 మి. గ్రాముల నత్రజని ఉంటుంది. అదే బీట్‌రూట్‌లో అయితే ప్రతి వంద గ్రాములో 15 గ్రాముల నత్రజని ఉంటుంది. అందువల్ల రోజు మొత్తంలో ఈ రెండింటిలో ఏదో ఒకటి 100 గ్రాముల మోతాదులో ఆహరంతో తీసుకుంటే కంటి సమస్యలు చాలా వరకు తొలగిపోవడమే కాకుండా, అసలు రాకుండానే పోతాయి.