నాలుక చూసి జబ్బులు చెప్పేయొచ్చు

ఆంధ్రజ్యోతి, 16/12/2014: నాలుకను పరీక్షించడం ద్వారా దాదాపు 14 రకాల జబ్బులను కనుక్కోవచ్చుట. ఇదెలా సాధ్యం అంటారా? సాధ్యమేనని ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. చెన్నైలోని రాజ్యలక్ష్మి ఇంజనీరింగ్‌ కాలేజీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగం నాలుకను పరీక్షించే ఒక సరికొత్త విధానాన్ని కనుగొంది. ఈ విధానం ద్వారా దేశం మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ పేషంటు ఉన్నా ఈ వైద్య పరీక్ష సులువుగా అయిపోతుంది. ఎలాగంటారా? ఈ తరహా పరీక్షలో పేషంటును కొన్ని ప్రశ్నలు వేస్తారు. వారు చెప్పిన లక్షణాలను రాసుకుంటారు. పేషంటు నాలుకను ఫోటో తీస్తారు. పేషంటు చెప్పిన రోగలక్షణాలను పోల్చి చూస్తారు. వ్యాధిని నిర్థారిస్తారు. నాలుక యొక్క డిజిటైజ్డ్‌ ఇమేజెస్‌ ద్వారా నాలుక ఎలాగ ఉందో గమనిస్తారన్నమాట. నాలుక రంగులో ఏమైనా మార్పు వచ్చిందా? దాని రంగు తగ్గిందా? టెక్స్చర్‌ ఎలా ఉంది వంటి అంశాలు గమనించడం ద్వారా జబ్బులను గుర్తించడం జరుగుతుంది. ఇలా కనుగొన్న సమాచారాన్ని వైద్యులకు అందజేస్తారు. రోగి కున్న ఇతర లక్షణాలతో పాటు నాలుక ఎలా ఉందన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దాన్నిబట్టి ఫ్లూ, బ్రోంకైటిస్‌, స్ర్టెప్టోకోకల్‌ త్రోట్‌ ఇన్‌ఫెక్షన్‌, అలర్జీలు, సైనసైటిస్‌, ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాలను గుర్తించవచ్చు. ఈ సరికొత్త ‘టంగ్‌ ఎనాలిసిస్‌ సిస్టమ్‌’ ద్వారా 14 పైగా జబ్బులను కనుగొనొచ్చు. ఆరోగ్య సౌకర్యాలు లేని మారుమూల పల్లెల్లో ఉండే ప్రజలను పరీక్షించేందుకు ఈ తరహా విధానాలు ఎంతగానో ఉపయోగపడతాయని వేరే చెప్పాలా? ఈ విధానం ద్వారా వారి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.