శబ్దాలతో ఒత్తిడి!

23-5-2017: చుట్టూ రణగొణ ధ్వనులు, పెద్ద పెద్ద శబ్దాలు ఉంటే మెదడు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా పిల్లల ఎదుగుదల మీద ఈ శబ్దాలు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి అంటున్నారు. అదే పనిగా శబ్దాలు వింటూంటే మెదడులో ఒత్తిడిని కలిగించే హార్మోన్లు విడుదల అవుతాయి. నిత్యం రణగొణ ధ్వనుల మధ్య గడిపే పిల్లలు ఎదుటి వారు ఏం చెబుతున్నారో కూడా గ్రహించే శక్తిని కోల్పోతారట! వీరిలో నిద్రలేమి అనేది ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఈ విషయాలన్నీ ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడయ్యాయి. కొంతమంది చిన్న పిల్లలను ఎక్కువ శబ్దాలు వినిపించే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉంచారు. మరికొంత మందిని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచారు. కొన్ని నెలల అనంతరం వీరి మెదడు పనితీరు పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న పిల్లల మెదడులో హిప్పొకేంపస్‌ అనే కణాల వృద్ధిని కనుగొన్నారు. ఈ కణాలు పిల్లల్లో చురుకుదనాన్ని, జ్ఞపకశక్తిని కలిగిస్తాయి. అదే శబ్దాల వాతావరణంలో ఉన్న పిల్లలో ఒత్తిడి హార్మోన్లు ఎక్కువ విడుదల కావడం గమనించారు.