వాసన ఎందుకు తెలియదు?

26-02-2018: ప్రతి అవయవం దేనికది సక్రమంగా పనిచేస్తున్నప్పుడు ఏమీ తెలియదు గానీ, ఏదో ఒక అవయం అసలే పనిచేయకుండా పోయినప్పుడు మాత్రమే ఆ బాధేమిటో తెలుస్తుంది. అయితే స్పర్శ, రుచి తెలియకుండా పోయినట్లే, కొందరికి ఒక్కోసారి వాసన తెలియకుండా పోతుంది. దీనివల్ల వీళ్లకు పూలతోటలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, తేడా అనిపించదు. కాకపోతే ఈ సమస్య మొదలైన ఎంతో కాలం దాకా చాలా మందికి తమకు ఆ జబ్బుఉన్నట్లే తెలియదు. ఈ లోపం వల్ల మునుముందు రాబోయే జబ్బుల గురించి ముందే తెలుసునే స్థితిని కోల్పోతారు. ఒక్కోసారి ఇదో పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. ఉదాహరణకు ఇంటి లోపల ఎక్కడైనా, నిప్పు అంటుకుని కాలి బూడిద అవుతున్నా వీళ్లకు తెలియదు.

మామూలుగా అయితే వయసు పైబడిన వారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆ మాటకొస్తే వయసుతో ప్రమేయం లేకుండా కూడా కొందరిలో ఈ సమస్య తలెత్తుతుంది, మౌలికంగా మనకు వాసన తెలియడం అనేది ముక్కులోపలి పొర ఆరోగ్యం మీద, వాసనను గుర్తించే ఆల్‌ఫ్యాక్టరీ నరాలు సక్రమంగా పనిచేయడం మీద ఆధారపడి ఉంటుంది. వాటిల్లో ఎక్కడైనా కాస్త తేడా వస్తే వాసన తెలియకుండా పోతుంది, వాసన తెలియకుండా పోవడానికి ముక్కులో బొడిపెలు ఏర్పడటం, సైనస్‌ సమస్యలతో పాటు ఆయా రుతువుల్లో వచ్చే అలర్జీలు కూడా కారణం కావచ్చు, దీనికి తోడు వాసన తెలియకపోవడానికి కొందరిలో అల్జీమర్‌, పార్కిన్‌సన్‌ వంటి నరాల జబ్బులు కూడా కారణం కావచ్చు. అందుకే నాలుగు వారాల దాకా వాసన తెలియని పరిస్థితి ఏర్పడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం.