చెవిలో డ్రాప్స్‌ వేస్తే ఇదేమిటి?

16-06-2018: మా అబ్బాయికి 8 ఏళ్లు. దాదాపు రెండేళ్లుగా చెవిలో వేలు పెట్టి కెలకడం ఒక అలవాటుగా ఉంటూ వచ్చింది. అయితే ఓ నాలుగు మాసాలుగా ఈ అలవాటు మరీ ఎక్కువయ్యింది. ఒక పీడియాట్రిషియన్‌కు చూపిస్తే, ఏవో ఇయర్‌ డ్రాప్స్‌ రాశాడు. అవి ఓ నాలుగు రోజులు వేయగానే చెవిలోని చర్మమంతా కందిపోయి దాదాపు చితికినట్లయ్యింది. పైగా చెవిలోంచి ద్రవం లాంటిది రావడం మొదలయ్యింది. ఒక సమస్య కోసం వెళితే, మరో సమస్య మొదలయ్యింది. ఇదేమిటని మళ్లీ వెళితే, కొన్ని మాత్రలు, ఏదో క్రీము రాశాడు. వాటితోనూ ఉపశమనమేమీ కలగలేదు. రోజురోజుకీ ఆ భాధ ఇంకాస్త ఎక్కువే అవుతోంది. ఇప్పుడేం చేయమంటారో చెప్పండి!
- ఎల్‌. కరుణాకర్‌, కడప
 
మీ బాబు సమస్య అంతా చెవిలో గుబిలి పేరుకోవడమే. చెవిలో గుబిలి ఎక్కువగా పేరుకుపోయినప్పుడు పిల్లలు అలా కెలుకుతూ ఉంటారు. దానికి చెవిలో కాండిబయోటిక్‌ డ్రాప్స్‌ వేస్తే ఆ గుబిలి మెత్తబడిపోయి, తీసివేయడం సులువవుతుంది. అలా కాకుండా టర్పెంటైన్‌ ఆయిల్‌ లాంటివేవో వేస్తే చెవిలోని ఎక్స్‌టర్నల్‌ ఆడిటరీ కేనల్‌ చర్మమంతా దెబ్బతింటుంది. కొన్ని సార్లు చెవిలో ఇన్‌ఫెక్షన్లు తయారై కొన్ని ద్రవాలు కూడా చెవిలోంచి బయటికి రావచ్చు. ఈ స్థితిలో ఇన్‌పెక్షన్లు, అలర్జీలు తగ్గడానికి యాంటీబయాటిక్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. వాటితో ఓ 10 రోజుల్లో లోపలి చర్మం మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఆ తర్వాత చెవిలోని గుబిలినంతా తీసివేయాలి. అయితే ఆ తర్వాత 15 రోజుల దాకా తలస్నానం చేయకూడదు. ఈ కాలంలో చెవిలో ఏ కాస్త తడి ఏర్పడినా లోపల ఫంగస్‌ ఏర్పడవచ్చు. లోలోపల నీరు నిలిచిపోవచ్చు. ఈ స్థితిలోనూ సరియైున చికిత్స అందకపోతే, ఒక్కోసారి కర్ణబేరి పగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒక్కోసారి చెవిలో వేసిన డ్రాప్స్‌ పూర్తిగా లోనికి వెళ్లకపోవచ్చు అందుకే గాజ్‌ పీస్‌ను లోపల ఉంచి దాన్ని 3 రోజుల పాటు అలాగే ఉంచి డ్రాప్స్‌ వేయాల్సి ఉంటుంది. ఏమైనా ఎక్కువగా గుబిలి ఏర్పడటం అనేది సాధారణ సమస్యేమీ కాదు. అందుకే ఏమాత్రం జాప్యం చేయకుండా వెంటనే ఒక ఇ.ఎన్‌.టి డాక్టర్‌ను సంప్రదించండి. మీ బాబు సమస్య పూర్తిగా నయమవుతుంది.
- డాక్టర్‌ అనీల్‌ వాసిరెడ్డి
కన్సల్టెంట్‌ ఇ.ఎన్‌.టి స్పెషలిస్టు,
శ్రీ సాయి క్లినిక్‌, అమీర్‌పేట్‌, హైదరాబాద్‌