కొత్తగా ఈ సమస్యలన్నీ ఏమిటి?

10-05-2018: నా వయసు 42. దాదాపు రెండేళ్లుగా సైనస్‌ సమస్య ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఎక్స్‌-రే తీసి సర్జరీ చేయాలన్నారు. ఆరు మాసాలక్రితం శస్త్రచికిత్స చేయించుకున్నాను. అయితే సైనస్‌ తాలూకు ముక్కు దిబ్బడ తగ్గిపోయింది గానీ, అప్పుడప్పుడు ముక్కునుంచి రక్తస్రావం అవుతోంది. దీనికి తోడు లాలాజలం మింగుతున్నప్పుడు చెవిలోపలి భాగం కంపించినట్లు అవుతోంది. చెవిలోంచి శబ్దాలు రావడంతో పాటు, చెవికింది దవడ భాగం. దంతాలు నొప్పిపెడుతున్నాయి. నిజానికి, సర్జరీకి ముందు ఈ సమస్యలేవీ లేవు. కొత్తగా ఎందుకు మొదలైనట్లు నాకేమీ అర్థం కావడం లేదు. ఏం చేయాలో చెప్పండి.

- కె. వికాస్‌, ఖమ్మం
 
చెవి, ముక్కు, గొంతు ఈ మూడింటిలోని ఏ ఒక్క దాంట్లో సమస్య ఉన్నా, అది మిగతా రెండింటికీ పాకుతుంది. మీ విషయంలో మూడు రకాల సమస్యలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి సైనస్‌. కొందరిలో కర్ణభేరి వెనుక ఉండే ఎముకలు, నరాలు బలహీనపడటం. ఇది రెండవ కారణం. గొంతు, చెవిని కలిపే నాళంలో అలర్జీలు పెరిగి ముక్కుమూసుకుపోవడం మూడో కారణం. దీనివల్ల చెవికీ గొంతుకీ మధ్యఉండే నాళం మీద ఒత్తిడి పడుతుంది కర్ణభేరి వెనుక నీరు లాంటి తయారై అందులో ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. ఫలితంగా దవడకీ చెవికీ దగ్గరగా ఉండే ఎముకలు, కండరాల్లో నొప్పి మొదలవుతుంది. వ్యాధి నిర్ధారణ కోసం ముందు సీ. టీ స్కాన్‌ చేయించాలి. ఆ తర్వాత ప్యూర్‌ టోన్‌ ఆడియోగ్రామ్‌, ఇంపెడెన్స్‌ ఆటో మెట్రీ పరీక్షలు చే యించాలి. ఆ రిపోర్టుల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది. ఒక సారి మీ సమస్యల వెనుక ఉన్న అసలు కారణాలు తెలిసిపోతే వైద్య చికిత్సలు సులువవుతాయి.
 
 
డాక్టర్‌ అనీల్‌ వాసిరెడ్డి
కన్సల్టెంట్‌ ఇ.ఎన్‌.టి స్పెషలిస్ట్‌
రశ్రీ సాయి క్లినిక్‌, హైదరబాద్‌