శ్వాసకోశాలకు పసందైన మందు

ఆంధ్రజ్యోతి, 10-07-2018: పొగ తాగే అలవాటు నుంచి బయటపడటం సంతోషకరమే. కాకపోతే, అంతకు ముందు కొన్ని ఏళ్ల పర్యంతం తాగిన తాలూకు దుష్ప్రభావాలు శరీరం పైన ఉండే ఉంటాయి. ముఖ్యంగా శ్వాసకోశాలు క్షీణించడం వాటి పనితనం తగ్గడం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇందుకు వైద్య చికిత్సలు ఎన్ని తీసుకున్నా, టమోటాలు, ఆపిల్‌ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనం చాలా ఎక్కువ అంటున్నారు పరిశోధకులు. ఇటీ వలి ‘యూరోపియన్‌ రెస్పిరేటరీ జర్నల్‌’ ఇటీవలి సంచికలో ఇందుకు సంబంధించిన ఒక వ్యాసం ప్రచురితమయ్యింది. ఈ పండ్లల్లోని కొన్ని అంశాల్లో శ్వాసకోశాలను రిపేర్‌ చేసే శక్తి ఉన్నట్లు వారు కనుగొన్నారు. రోజుకు రెండు టమోటాలు, మూడు ఆపిల్స్‌కన్నా ఎక్కువగా తినేవారి శ్వాసకోశాల్లో జరిగే క్షీణత వేగం బాగా తగ్గిపోతున్నట్లు వారు కనుగొన్నారు. అయితే అంతకన్నా తక్కువగా తినే వారిలో ఈ ప్రయోజనాలు పెద్దగా కనిపించడం లేదని కూడా వారు గుర్తించారు.
 
అలాగని, ఈ పదార్థాల వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం మాజీ స్మోకర్లకు మాత్రమే అనేమీ వారు చెప్పడం లేదు. పొగ తాగి మానేసిన వారికి ఈ ప్రయోజనం ఎలాగూ కలుగుతుంది. అయితే పొగ తాగకపోయినా, వయసు పైబడిన కారణంగా, శ్వాసకోశాలు దెబ్బ తింటున్న వారికి కూడా ఈ టమోటా, ఆపిల్స్‌ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటున్నట్లు వారు చెబుతున్నారు. ఆయా వ్యక్తుల్లోని కొన్ని సాధారణ లేదా ప్రత్యేక ఆరోగ్య సమస్యల కారణంగా కొందరిలో 30 ఏళ్లు దాటిన ప్పటి నుంచే శ్వాసకోశాలు క్షీణించడం మొదలవుతుంది. శ్వాసకోశాల పనితనం తగ్గడం అంటే అన్ని రకాల వ్యాధులు రావడానికి అకాల మరణానికి గురికావడానికి ధ్వారాలు తెరుచుకోవడమే.
 
ముఖ్యంగా సీ.ఓ.పీ.డి (క్రానిక్‌ ఆబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌,) గుండె జబ్బులు, శ్వాసకోశ కేన్సర్‌ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి. ఏమైనా, పరిశోధనల్లో తేలిన అంశాలను బట్టి, టమోటా, ఆపిల్‌ పండ్లను ఆహరంగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యలనుంచి చాలా వరకు బయటపడ వచ్చునని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.