శ్వాసకోశాల శక్తి పెరిగేందుకు..

ఆంధ్రజ్యోతి, 27-12-2016: జీవితకాలమంతా, దాదాపు విశ్రాంతే లేకుండా పనిచేసే శరీర అవయవాల్లో శ్వాసకోశాలు కీలకం. కాకపోతే బాగా నిర్లక్ష్యానికి గురయ్యేవి కూడా ఇవే. నిజానికి ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ పెంచే వీటిని కాపాడుకోవడం ఎంతో సులువు. ఆ విధానాల్లో ముఖ్యంగా.....

యోగా, ప్రాణాయామాలు చేయడం కుదరకపోతే, నిత్యం కనీసం, 10- 15 నిమిషాల పాటు లోతైన శ్వాస తీసుకోగలిగినా శ్వాసకోశాల శక్తి బాగా పెరుగుతుంది. నిజానికి, స్విమ్మింగ్‌, జాగింగ్‌, ట్రెక్కింగ్‌ లాంటి ఏ వ్యాయామంతోనైనా ఊపిరితిత్తుల శక్తి వృద్ధి చెందుతుంది.

సహజంగానే, నీటికి అనేక వ్యాధుల్ని నయం చేసే శక్తి ఉంది అందువల్ల సరిపడా నీళ్లు తాగే వాళ్లల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా, శ్వాసకోశాలు తేమతో ఉంటూ ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాయి.

ఉల్లి, వెల్లుల్లి వంటి ఘాటైన ఆహార పదార్థాల్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. పైగా వీటిలో ఇన్‌ఫెక్షన్లను నియంత్రించే శక్తి కూడా ఉండడం వల్ల శ్వాసకోశాలు రోగగ్రస్తం కాకుండా ఉంటాయి.

క్యాప్సికమ్‌లోని కొన్ని అంశాలు రక్తప్రసరణను పెంచడం ద్వారా శరీరంలో ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని నింపుతాయి.

నట్స్‌, ఇతర చిక్కుడు ధాన్యాల్లో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి, వాటిని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మేలు. ఇవి మొత్తంగా ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు శ్వాసకోశాల పనితనాన్ని కూడా పెంచుతాయి.

సిట్రస్‌ పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల అందులోని సి- విటమిన్‌తో ఆక్సిజన్‌ను సమర్థవంతంగా సర ఫరా చేసే శక్తి శ్వాసకోశాల్లో పెరుగుతుంది. గుమ్మడి కాయల్లో కూడా సి- విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్వాసకోశ వ్యాధులను కూడా అవి దూరంగా ఉంచగలుగుతాయి. క్యారె ట్ల వల్ల కూడా ఈ ప్రయోజనాలే కలుగుతాయి.

గ్లాసు పాలల్లో కాస్తంత పసుపు వేసి మరిగించి ప్రతి రోజూ రాత్రివేళ తాగితే శ్వాసకోశాల్లో ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి పెరుగుతుంది. ఇలా చేయడంవల్ల జలుబు లాంటి పలు వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చు.

అల్లంలో వాపు రాకుండా చేసే గుణం ఉండడం వల్ల దాన్ని వాడటం వల్ల కలుషితాల దుష్ప్రభావాలు శ్వాసకోశాల మీద పడకుండా చూసుకోవచ్చు.