హఠాత్తుగా చెవుడు వచ్చేస్తే....

09-04-2019: వయసు పైబడటం వల్లనో, మరే కారణంగానో, వినికిడి శక్తి క్రమక్రమంగా తగ్గడం వేరు. అలా కాకుండా, కొద్ది గంటల్లో, లేదా ఓ వారం పది రోజుల్లోనే పూర్తిగా వినిపించకుండా పోవడం వే రు. ఇలా హఠాత్తుగా వినికిడి శక్తి తగ్గిపోవడాన్ని ఎస్‌.ఎస్‌.ఎన్‌.హెచ్‌.ఎల్‌ (సడెన్‌ సెన్సరీన్యూరల్‌ హియరింగ్‌ లాస్‌) అంటారు. వినికిడి లోపం మెల్లమెల్లగా ఏర్పడుతున్నప్పుడు చాలా మంది గుర్తించలేక పోతారు. ఎదుటి వాళ్లు వేలెత్తి చూపే దాకా కొంత మంది అసలు గుర్తించలేరు. వినికిడి లోపమే తప్ప నొప్పి, బాధ ఏమీ ఉండవు కాబట్టి చాలా మంది నిర్లక్ష్యంగా ఉండిపోతారు.
 
అయితే హఠాత్తుగా వినికిడి శక్తి పూర్తిగా తగ్గిపోవడం చాలా మందిని కలవరపెడుతుంది. అయితే, చాలా వరకు ఈ సమస్య, ఏదో ఒక చెవిలోనే తలెత్తుతుంది. నిద్ర లేచినప్పుడో, చెవిలో కీచురాళ్ల శబ్దం వస్తున్నప్పుడో ఆ లోపం తెలుస్తుంది. అయితే కొందరిలో ఏ వైద్యమూ లేకుండానే కొద్ది రోజుల్లో ఆ లోపం తొలగిపోతుంది., కొందరిలో సమస్య కొంతమేరకే తగ్గిపోయి పాక్షికంగా వినిపిస్తుంది. మరికొందరిలో ఈ సమస్య ఏ మాత్రం తగ్గకుండా అలాగే ఉండిపోతుంది. ఈ స్థితిలో గృహవైద్యాలకే పరిమితం కాకుండా, వెంటనే నిపుణులైన వైద్య నిపుణులను సంప్రతించడం తప్పనిసరి. లేదంటే, ఆ వినికిడి లోపం జీవిత కాల సమస్యగా స్థిరపడిపోవచ్చు.