శబ్దాల హోరుతో చెవులకు హాని..

ఎంజాయ్‌మెంట్‌ అంటే చాలు టీనేజర్లు చెవికోసుకుంటారు. పాటలు, డాన్సులతో హోరెత్తే పార్టీలంటే వీళ్లకి మరీ ఇష్టం. వీటికి తోడు రకరకాల ఆడియో గాడ్జెట్స్‌ను ఇరవైనాలుగు గంటలూ చెవులకు తగిలించుకుని వింటూ ఆనందించిపోతుంటారు. లేదా ఎవరితో ఒకరితో గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుతూ టైమ్‌ పాస్‌ చేస్తుంటారు. ఇలా విచక్షణారహితంగా ఆడియోగాడ్జెట్‌లు వాడడం వల్ల చాలామంది యువత వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఒక పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. ఇలా వినికిడి శక్తి దెబ్బతిన్న యువత దాదాపు ఒక బిలియన్‌ మంది ఉన్నారుట. స్మార్ట్‌ ఫోన్లలో తరచూ పాటలు వినడం, మాట్లాడుతుండడంతోపాటు నైట్‌ క్లబ్బుల్లో, పబ్బుల్లో ఎక్కువ సౌండ్లతో పాటలు, మ్యూజిక్‌ వింటున్నారు. ఇందువల్ల తొందరగా వినికిడి సమస్య బారిన పడుతున్నారు. ప్రతి వ్యక్తీ రోజుకు ఒక గంటకు మించి ఫోన్‌లో మాట్లాడకూడదు.
 
కానీ అలా ఎవరూ ఉండడం లేదు. సంపన్నదేశాలు, వర్థమానదేశాల్లో జరిగిన పలు స్టడీలను పరిశీలిస్తే 12 నుంచి 35 ఏళ్లు వయసున్న టీనేజర్లు, యుక్తవయస్సు వారిలో 50 శాతం మందికి చెవులు సరిగా వినపడ్డం లేదని వెల్లడైంది. ఇందుకు కారణం సురక్షితం కాని ప్రమాణాల్లో పాటలు, మ్యూజిక్‌ వినడమేనని తేలింది. రకరకాల వినోదకార్యక్రమాల్లో ప్రమాదకరస్థాయిలో మ్యూజిక్‌ సౌండ్‌ పెడుతున్నారు. దీనివల్ల దాదాపు 40 శాతం మందికి వినికిడి సమస్య తలెత్తిందని   అధ్యయనాలు చెపుతున్నాయి. పార్టీలు, పండుగలు, ఉత్సవాలు, పెళ్లిళ్లు అని చెప్పి 100 డెసిబిల్స్‌ మించి సౌండ్లు పెడుతున్నారు. గంటల తరబడి మ్యూజిక్‌ పెడుతూ ఇంటా, బయటా శబ్ద కాలుష్యాన్ని తీవ్రంగా పెంచుతున్నారు.
 
ఇది చెవులకు చాలా హానికరం. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే శబ్దకాలుష్యం బారిన పడకుండా కనీస జాగ్రత్తలు ఎవ్వరూ తీసుకోవడంలేదు. ఉదాహరణకు 100 డెసిబుల్స్‌లో శబ్దాల్ని 15 నిమిషాల మించి వినకూడదు. కానీ గంటల తరబడి ఆ శబ్దాల హోరులో యువత కొట్టుకుపోతోంది. శబ్దకాలుష్యం బారిన పడకుండా ఇయర్‌ ప్లగ్స్‌ పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్య మధ్యలో చెవులకు కాస్తంత విరామం ఇవ్వాలని చెప్తున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ యాప్స్‌ను వినియోగించుకొంటూ సురక్షితమైన లిజనింగ్‌ ప్రమాణాలను అనుసరించాలంటున్నారు. సేఫ్‌ లిజనింగ్‌ ప్రాక్టీసె్‌సను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కిచెబుతున్నారు.ఊతీ×25