చెవిపోటు మటుమాయం

ఆంధ్రజ్యోతి, 17-07-2017: పసితనంలో సరిపడా పాలు, పోషకాహారం దొరక్కపోతే ఇతర శరీర భాగాలతో పాటు చెవిలోని శ్రవణ గ్రంధులు కూడా బలహీనపడతాయి. దీనివల్ల వినికిడి లోపాలు ఏర్పడటంతో పాటు చెవిలో దురద కురుపులు కావడం, చెవిపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ దురద కారణంగా పిల్లలు చెవిలో పుల్లలు పెట్టి తిప్పుతుంటారు. ఇలాచేస్తే కర్ణభేరిలో గాయాలై ఒక్కోసారి చెవిలో నీరు నిండడం, రక్తం రావడం వంటి సమస్యలు మొదలవుతాయి.

స్నానం చేసేటప్పుడు చెవుల్లోకి వెళ్లిన సబ్బు నురగను, మురికి నీటిని శుభ్రం చేసుకోకపోవడం, దుమ్ము, ధూళి, సిమెంటు, సున్నం, రసాయనాల్లో పనిచేసే వారు రోజూ చెవుల్ని శుభ్రం చేసుకోవడం వల్ల కూడా చెవి సమస్యలు వస్తాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఇంటి చిట్కాలు కొన్ని....

పిడికెడు నల్ల తుమ్మ ఆకు, కొంత బంతి పువ్వు ఆకు తెచ్చి, దంచి రసం తీయాలి. ఈ రసాన్ని రోజుకు మూడు సార్లు వేస్తే, చెవి పోటు తగ్గిపోతుంది.

గచ్చాకు రసంలో అర చెంచా మంచి నూనె, మూడు ఎల్లిపాయలు కలిపి నిప్పులపై ఉడికించి వడబోసుకుని ఉంచాలి. ఆ తైలాన్ని నెలరోజుల పాటు రోజుకు రెండు సార్లు క్రమం తప్పకుండా వేసుకోవాలి. అయితే ఈ సమయంలో పెరుగు, మజ్జిగ, చింత పులుసు, బంగాళా దుంపల వంటివి తినడం మానేస్తే వినికిడి లోపాలు ఉంటే తగ్గే అవకాశం ఉంది.