వినికిడి శక్తిపోతే వెనకబడటమే

ఆంధ్రజ్యోతి, 02-10-2013: కనిపించే లోకం ఒకటైతే, వినిపించే లోకం మరొకటి. వినిపించకపోవడం అంటే ఏమిటి. జీవితంలోంచి ఒక లోకమే అంతరించిపోవడం. ఇతర కారణాలతో పాటు నానాటికీ పెరిగిపోతున్న శబ్ద కాలుష్యాలు కూడా  వినికిడి శక్తిని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ఎప్పటికప్పుడు జాగ్రత్త పడకపోతే, వినిపించే ఆ ప్రపంచం పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు. 

అప్పుడే పుట్టిన శిశువులు పెద్ద వారు వినగలిగే శబ్దాలన్నీ వినలేరు. చెవికి సంబంధించిన నరాలన్నీ ఒక స్థాయికి రావడానికి దాదాపు సంవత్సరం పడుతుంది. పూర్తి పరిణతికి రావడానికి 18 నుంచి 24 మాసాల దాకా పట్టవచ్చు. అయితే వారి వినికిడి శక్తి సహజంగా ఉందోలేదో తెలుసుకోవడానికి ఎబిఆర్‌ (ఆడిటరీ బ్రెయిన్‌ రెస్పాన్స్‌) పరీక్ష చేయవలసి ఉంటుంది. 

కొంత మంది పిల్లల్లో ప్రత్యేకించి తొమ్మిది మాసాలు నిండక ముందే పుట్టిన వారు, తల్లికి 40 ఏళ్లు వచ్చాక పుట్టిన పిల్లల్లో గర్భంలో ఉన్నప్పుడు తల్లి టైఫాయిడ్‌, మలేరియా, వంటి జ్వరాల బారిన పడినప్పుడు లేదా తల్లికి మధుమేహం, లేదా అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్పప్పుడు పిల్లలకు గుండె జబ్బులు, నరాల వ్యాఽధులు థైరాయిడ్‌ గ్రంధి సమస్య ఉన్నా తల్లికి హార్మోన్‌ సమస్య ఉన్నా పిల్లల్లో పుట్టుకతోనే వినికిడి లోపాలు ఏర్పడే ప్రమాదం ఉంది. పిల్లల్లో ఏదైనా ఒక అవయవంలో లోపం ఉంటే దానితోపాటు మరికొన్ని అవయవాల్లోనూ లోపాలున్నాయేమో పరీక్షించాలి. కంటి లోపం ఉంటే చెవి లోపం కూడా ఉందేమో తెలుసుకోవాలి. పిల్లల్లో చెవి, కిడ్నీ, గుండె ఇలా ఒక సిండ్రోమ్‌గా సమస్య ఉండవచ్చు. గతంలో శిశువు పుట్టిన 6 మాసాలకు గానీ వినికిడి సమస్యలను అంచనా వేయడం సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన యంత్రపరికరాల ద్వారా పుట్టిన 10 రోజుల్లోనే శిశువు వినికిడి లోపాలను తెలుసుకోవడం సాధ్యమవుతోంది. 

పెద్దవారిలో 
మామూలుగా అయితే 60 ఏళ్లు వచ్చేసరికి 70 శాతం మందిలో వినికిడి లోపాలు మొదలవుతాయి. 
మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు ఉంటే 40 ఏళ్ల వయసులోనే ఈ సమస్యలు మొదలు కావచ్చు. 
కొంత మంది అనుకోకుండా ఒక చెవి మూసుకుని వినే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి స్థితిలో అనుకోకుండా ఒక చెవి వినిపించడం లేదన్న విషయం బయటపడుతుంది.
 
లోపాలు మూడు రకాలు 
బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి అంటూ చెవిలో మూడు భాగాలుంటాయి. బయటి చెవి, మధ్య చెవి మాత్రమే దెబ్బ తిని లోపలి చెవి బాగానే ఉంటే దాన్ని కండక్టివ్‌ హియరింగ్‌ లాస్‌ అంటారు. అలా కాక నరమే దెబ్బ తిని ఈ మూడు విభాగాలూ పాడైపోతే దాన్ని సెన్సరీ న్యూరల్‌ హియరింగ్‌ లాస్‌ అంటారు. 

ఎందుకు గుర్తించలేరు ? 
వినికిడి శ క్తి క్రమంగా తగ్గుతూ పోవడాన్ని చాలా మంది గుర్తించలేరు. శబ్దాలు లో, మిడిల్‌, హై అనే మూడు ఫ్రీక్వెన్సీస్‌లో ఉంటాయి. అయితే అన్ని ఫ్రీక్వెన్సీలను గ్రహించడంలోనూ లోపం ఏర్పడుతుందని కాదు. కొందరిలో లో, మిడిల్‌ ఫ్రీక్వెన్సీలు మామూలు గానే ఉండి హై స్వరం వినడంలో లోపం ఉండవచ్చు. కొందరికి కాలింగ్‌ బెల్‌ వినపడకపోవచ్చు. లేదా పక్క రూమ్‌లో ఫోన్‌ మోగితే వినపడదు అని చెబుతుంటారు. మరికొందరు ఒకరిద్దరు మాట్లాడితే వినగలుగుతాం. కానీ, నలుగురైదుగురు మాట్లాడితే మాత్రం వినపడదు అని చెబుతుంటారు. మిగతా సందర్భాల్లో బాగా వినపడుతూ ఏవో కొన్ని మాత్రమే వినిపించకపోవచ్చు. అందుకే వాళ్లు పెద్దగా ఇబ్బందికి గురవుతున్న భావనకు గురికారు. వయసు పైబడే వారిలో అన్ని స్థాయిల శబ్దాలు వినిపించకుండా పోవు. అందుకే ఏదో ఒక స్థాయిలో వినికిడి శక్తి త గ్గిపోవడాన్ని వారు పట్టించుకోరు. పైగా ప్రతి ఏటా వినికిడి శక్తి స్వల్పంగా తగ్గుతూ పోవడం వల్ల ఆ లోపాన్ని వారు గుర్తించలేకపోవచ్చు. 

సమస్య మరింతగా పెరుగుతూ పోతున్నప్పుడు మాత్రం గుర్తిస్తారు. మాటలకు, వినికిడి శక్తికీ దగ్గర సంబంధం ఉంది. ప్రత్యేకించి చిన్న పిల్లల్లో రెండేళ్లు వచ్చినా మాటలు రాకపోతే వినికిడి లోపాలున్నాయేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి..
 
నివారణగా...... 
సాధ్యమైనంత వరకు పెద్ద శబ్దాలకు దూరంగా ఉండడం. రోడ్ల మీద ఎక్కువగా తిరిగే వాళ్లు, పరిశ్రమల్లో పనిచేసే వారు ఇయర్‌ ఫ్లగ్స్‌ వాడటం మంచిది. ఇవి తక్కువ శబ్దం వినిపించేలా చేస్తాయి. ఇల్లు రోడ్డు పక్కనే ఉంటే సౌండ్‌ ఫ్రూఫ్‌ చేసుకోవడం మేలు. మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. తరుచూ చెవిలో ఇన్‌ఫెక్షన్లు వచ్చే వారు, ఫంగల్‌ సమస్య, చుండ్రు సమస్య ఉన్న వారు స్నానం చేసే సమయంలో చెవిలో దూది పెట్టుకోవడం శ్రేయస్కరం. చన్నీటిలో వైరస్‌ ఉంటుందికాబట్టి వేడి నీళ్లతో స్నానం చేయడం మేలు.
 
చికిత్స 
చెవిలో రంధ్రం ఉండి చీము వస్తున్నప్పుడు దాన్ని వెంటనే శస్త్రచికిత్స ద్వారా మూసివేయడం తప్పనిసరి. సీ్త్రలలో ఉండే మధ్య చెవిలో వచ్చే హార్మోన్‌ సమస్యతో వచ్చే వినికిడి లోపాన్ని శస్త్ర చికిత్స ద్వారా సరిచేయించుకోవాలి నరాల్లో సమస్య ఉంటే శస్త్ర చికిత్స చేయించుకోవాలి. ప్రమాదాల్లో గానీ, ఇన్‌ఫెక్షన్ల వల్ల గానీ, హఠాత్తుగా వచ్చే వినికిడి లోపాలు మందులతో నయమవుతాయి. రెండు వారాల లోపే వైద్యం తీసుకోకపోతే అది కూడా దీర్ఘకాలిక సమస్యగా మారిపోవచ్చు. రెండు వారాలలోపే వినికిడి లోపం ఎక్కువగా ఉన్నప్పుడు హియరింగ్‌ ఎయిడ్స్‌ పెట్టుకోవడం చాలా ముఖ్యం.